Union Budget 2024 : రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది. రాష్ట్రానికి సంబంధించి వివిధ రంగాలకు కేటాయింపులు జరుగుతాయనే అంచనాలతో రాష్ట్ర సర్కారు ఉంది. దీనిపై ఇవాళ సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను(Union Budget 2024) కలిసి సీఎం రేవంత్ చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీకి నోచుకోకుండా మిగిలిన పలు ప్రభుత్వరంగ సంస్థల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లోని ఫండ్స్‌ను అందించే ఏర్పాట్లు చేయాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల జాబితాను కూడా రెడీ చేశారు. ఈ అంశాలు విభజన చట్టం అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖతో ముడిపడి ఉన్నందున అక్కడే సెటిల్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ప్రతి జిల్లాకూ రూ.50 కోట్లు చొప్పున తెలంగాణ రాష్ట్రంలోని 9 వెనకబడిన జిల్లాలకు సంవత్సరానికి రూ.450 కోట్లు రావాల్సి ఉంది. గత నాలుగేళ్లుగా ఆ నిధులు రిలీజ్ కాలేదు. దీంతో వాటిని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలను సీఎం రేవంత్ కోరనున్నారు. ఏపీ జెన్‌కో నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రాష్ట్ర విభజన సందర్భంగా కమర్షియల్ టాక్స్ డిపార్టుమెంటుకు చెందిన నిధులు, తెలంగాణ ఏర్పడిన కొత్తలో పొరపాటున ఏపీ ఖాతాలో జమ అయిన డబ్బులను తిరిగి సెటిల్ చేయాలని కేంద్ర సర్కారును తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది.
- విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు మంజూరైన ట్రైబల్ యూనివర్సిటీ ఏడు సంవత్సరాల్లో కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ.889.07 కోట్లు రావాల్సి ఉంది. దానిలో ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఈసారి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.
- రాష్ట్ర విభజన సందర్భంగా అనంతపూర్, కర్నూలు జిల్లాల్లోని డిస్కంల రుణభారం తెలంగాణపై పడింది. దీంతో సుమారు రూ.24,106 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉంది. రెండేండ్ల పాటు ఏపీ నుంచి తెలంగాణ విద్యుత్ వాడుకున్నందున.. కట్టాల్సిన రూ.6,756 కోట్లను మినహాయించి మిగిలినదాన్ని చెల్లించాలి.
- ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారుణం పద్దు కింద ఎక్సెటర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులకు ఉద్దేశించిన రూ.17,666.66 కోట్లలో రూ.8,737.29 కోట్లే రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ జరిగింది. ఇంకా రూ.8,929.37 కోట్లు జనాభా నిష్పత్తిలో రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంది.