Telangana Hung: తెలంగాణలో హంగ్ హంగామా దేన్ని సూచిస్తోంది..?

తెలంగాణలో ఎన్నికల (Telangana Hung) ప్రక్రియ ప్రారంభించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. రేపో మాపో తెలంగాణ ఎన్నికల తేదీ ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - October 8, 2023 / 10:27 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Telangana Hung: తెలంగాణలో ఎన్నికల (Telangana Hung) ప్రక్రియ ప్రారంభించడానికి ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. రేపో మాపో తెలంగాణ ఎన్నికల తేదీ ప్రకటించడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నవంబర్, డిసెంబర్ మధ్యలో ఈ ఎన్నికలు ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూడు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఎత్తులు, పొత్తులు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు, ఆరోపణలు ప్రత్యారోపణలు, దాడులు ప్రతి దాడులు ఊపందుకున్నాయి. దీంతో తెలంగాణలో గెలుపు గుర్రాలు ఎవరు అనే విషయం మీద రకరకాల రాజకీయ విశ్లేషణలు, ఊహాగానాలు, రకరకాల సర్వేలు వెలుగుచూస్తున్నాయి. ఇక అందరి దృష్టి ఎన్నికల మీదే ఉంది. ఒకప్పుడు ఉన్న రాజకీయ సమీకరణలు, పార్టీలలో భారీ భరోసాలు ఇప్పుడు కొంచెం తారుమారైనట్టుగా వాతావరణం కనిపిస్తుంది.

తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకూ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏర్పాటు చేసి, మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ ఎంతో దూకుడుగా ముందుకు సాగుతోంది. వారి దూకుడుకు కళ్లెం వేయడానికి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ మూడు ప్రధాన పక్షాల్లో కీలకమైన పోటీ జరిగే ఆ రెండు పార్టీలు ఏమిటనే వాదన కూడా కొంతకాలం సాగింది. ఇప్పుడు క్రమక్రమంగా ఆకాశంలో మబ్బులు వీడినట్టు తెలంగాణ రాజకీయ ఆకాశంలో ఊహాగానాల మబ్బులు విడిపోయి, రెండు ప్రధాన వైరి పక్షాల మధ్యనే పోటీ జరిగే స్థితి తేటతెల్లమవుతోంది. అవి అధికార బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలే. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు మొన్న మొన్నటి దాకా తెలంగాణలో తామే అధికారంలోకి రాబోతున్నామని ధీమా ప్రకటించిన తీరుతెన్నులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ నాయకుల మాటల్లో ఆ ధీమా వ్యక్తం కావడం లేదు. పైగా వారి మాటలు చూస్తుంటే ప్రధాన పోటీలో తాము ప్రధానంగా ఉంటామన్న ఆశాభావం స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే బిజెపి నాయకుల నోట ఇప్పుడు తెలంగాణలో హంగ్ వస్తుంది అనే అంచనాలు వినపడుతున్నాయి.

తెలంగాణలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదని హంగ్ వచ్చే అవకాశం ఉందని తాజాగా బిజెపి కీలక నేత బి.ఎల్. సంతోష్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. గతంలో అదే పార్టీ నాయకుడు రఘునందన్ రావు కూడా హంగ్ మాటనే వల్లించారు. వీరి మాటలు చూస్తుంటే తెలంగాణలో ఎన్నికల రణరంగంలో బిజెపి ముందు వరుసలో ఉండే అవకాశం లేదని అందరికీ అర్థమవుతోంది. మరి వారి నోట పదేపదే వినిపిస్తున్న హంగ్ అసెంబ్లీ సంకేతాలు ఏం సూచిస్తున్నాయి అనేదే ఇప్పుడు చర్చనీయాంశం. అంటే వారు పైకి చెప్పకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈసారి పోటీలో కీలక స్థానంలో ఉంటుందని ప్రజలందరికీ అర్థమవుతోంది. అలా మూడు పక్షాలు హోరాహోరీగా యుద్ధం సాగించినప్పుడు ఏ ఒక్క పార్టీకీ పూర్తి మెజారిటీ రాకపోవచ్చు. అప్పుడు మూడింటిలో రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అనివార్య పరిస్థితి వస్తుంది.

Also Read: Fasalrin Loan : ఈ వెబ్ సైట్ లో రైతులకు తక్కువ వడ్డీకే లోన్స్

We’re now on WhatsApp. Click to Join.

మరి ఆ రెండూ ఏ పార్టీలు కావొచ్చు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. బిజెపి మాటలు చూస్తుంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని, అనివార్యంగా తమ పార్టీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అగత్యం రావచ్చని వారు సంకేతాలు ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. దీని అర్థం ఎన్నికల ముందు బీఆర్ఎస్, బిజెపి రెండూ ఎంతగా పరస్పరం యుద్ధం చేసుకున్నా, ఎన్నికలు ముగిశాక ఆ యుద్ధం, ఇద్దరి మధ్య బంధుత్వంగా పరిణమించే అవకాశాలు లేకపోలేదని అందరికీ విడమర్చి చెప్పడమే.

తెలంగాణలో బీఆర్ఎస్ తో ప్రధానంగా తలపడేది మేమే అని ఒక పక్కన చెబుతూనే మరోపక్క హంగ్ ఏర్పడే అవకాశం ఉందని పదేపదే చెప్తూ, కనిపిస్తున్నదంతా నిజం కాదని కనిపించని మరో కోణం ఏదో ఉందని బిజెపి నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పలుమార్లు బిజెపి, బీఆర్ఎస్ రెండూ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు అని వ్యాఖ్యలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు బిజెపి వారు రాష్ట్రంలో హంగ్ వస్తుందని ముందే ప్రకటించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శ వెలుగులో అర్థం చేసుకోవాలి. ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతిచ్చే అవకాశం లేదు. లేదా కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశం అసలే లేదు. కాంగ్రెస్, బిజెపి చేతులు కలిపే ప్రశ్నే లేదు.

ఇక మిగిలింది ఎంఐఎం. మరి మజ్లిస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్, బిజెపి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటే ఆ ప్రభుత్వానికి మద్దతిస్తారా? అది సిద్ధాంతరీత్యా సాధ్యం కాదని ఇప్పుడు మనం చెప్పవచ్చు .కానీ దేశవ్యాప్తంగా మజిలీస్ పార్టీ నాయకులు బిజెపికి వ్యతిరేక కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలతో చేతులు కలపలేదు. దీని అర్థం దేశంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో మజ్లిస్ వారు తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి ప్రతిపక్ష ఓట్లను చీల్చే అవకాశం ఉంది. తద్వారా బిజెపికి పరోక్షంగా వారు సహాయపడే అవకాశం కూడా ఉంది. ఇలాంటి విమర్శలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి కూడా. దీనికి ఎంఐఎం వారు ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ తెలంగాణలో హంగ్ ఏర్పడి బిజెపితో బీఆర్ఎస్ అనివార్యంగా జతకట్టాల్సిన పరిస్థితి వస్తే, ఎంఐఎం బహిరంగంగా మద్దతు తెలుపకపోయినా మౌనంగా ఆ చోద్యం చూస్తూ ఉండిపోవచ్చు. ఎన్నికల రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు.

ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో పార్టీల బలాబలాలు రాను రాను తీవ్రంగా మారుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పైకి ఎంత చెబుతున్నప్పటికీ, ప్రధాని మోడీ అంతటి మహానాయకుడు తెలంగాణ వచ్చి కేసీఆర్ మీద విమర్శలు గుప్పించి వెళ్లినప్పటికీ, ఇదంతా పైపై తతంగమేనని వారి బంధం వేరే ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో చెబుతున్న విషయానికి ఇప్పుడు బీజేపీ నోట వినిపిస్తున్న హంగ్ పాట బలం చేకూరుస్తుంది. ఏం జరిగినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. అధికారమే పరమావధిగా సాగే ఎన్నికల పోరాటంలో ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో తక్షణమే తేల్చి చెప్పడానికి లేదు. ఎన్నికల పూర్వరంగం ఒకలాగా.. ఎన్నికల అనంతర రంగం మరోలాగా ఉంటుందని మనకు చరిత్ర అనేక సాక్ష్యాలు అందిస్తుంది. చూడాలి, బిజెపి వారు లేపిన తాజా హంగ్ హంగామా ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుందో..!