Site icon HashtagU Telugu

Integrated Residential Schools: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఎలా ఉంటాయంటే?

Integrated Residential Schools

Integrated Residential Schools

Integrated Residential Schools: స‌మాజంలోని వెనుక‌బ‌డిన వ‌ర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీలసీ వ‌ర్గాల పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించి వారిని ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్ది ఆయా కుటుంబాలు ఆత్మ‌గౌర‌వంతో జీవించాల‌నే ల‌క్ష్యంతో రాష్ట్రంలోని రేవంత్‌ ప్ర‌భుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియ‌ల్ స్కూల్స్‌ (Integrated Residential Schools) ఏర్పాటుకు పూనుకుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వెనుక‌బడిన వర్గాల నుంచి వ‌చ్చే పిల్ల‌ల‌కు అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో బోధ‌న సాగించేందుకు వీలుగా బోధ‌న అభ్య‌స‌న ప‌రిక‌రాల‌తో పాటు అత్యాధునిక మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఉన్న‌ 600 ప్ర‌భుత్వ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల్లో గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్ల కాలంలో ఎటువంటి వ‌స‌తులు క‌ల్పించ‌లేదు. అవ‌న్నీ దాదాపుగా ప్రైవేటు అద్దె భ‌వ‌నాల్లోనే కొన‌సాగుతున్నాయి.

వ‌స‌తులు లేని ప్రైవేటు అద్దె భ‌వ‌నాల నుంచి అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లోకి ఈ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను త‌ర‌లించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ప్ర‌తిపాదిత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూళ్ల‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా వ‌స‌తుల‌తో పాటు బోధన, బోధనేతర సిబ్బందికి నివాస గృహాలు, ప్ర‌తి పాఠశాల‌లో 2,650 మంది విద్యార్థులకు వసతి కల్పించ‌నున్నాయి.

ప్ర‌తి యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్‌లో అక‌డ‌మిక్ బ్లాక్ నాలుగు బ్లాక్‌లుగా జీ+2 ఫ్లోర్ల‌తో 1,60,339 చద‌ర‌పు అడుగులు, డార్మెట‌రీ జీ+3 ఫ్లోర్ల‌తో ఆరు బ్లాక్‌లతో 2,57,451 చ‌ద‌ర‌పు అడుగులు, డైనింగ్ క‌మ్ కిచెన్ జీ+1 ఫ్లోర్ల‌తో 41,860 చ‌ద‌ర‌పు అడుగులు, 3 బీహెచ్‌కే ప్రిన్సిప‌ల్ క్వార్ట‌ర్స్ నాలుగు యూనిట్లు ఒక బ్లాక్ గా జీ+1 ఫ్లోర్ల‌తో 7,483 చ‌ద‌ర‌పు అడుగులు, 2 బీహెచ్‌కే స్టాఫ్ క్వార్ట‌ర్లు 48 యూనిట్లు 1 బ్లాక్‌గా జీ+3 ఫ్లోర్ల‌తో 61,378 చ‌ద‌ర‌పు అడుగులు, 1 బీహెచ్‌కే క్వార్ట‌ర్లు 8 యూనిట్లు 1 బ్లాక్‌గా జీ+1 ఫ్లోర్ల‌తో 7,324 చ‌ద‌ర‌పు అడుగుల‌తో మొత్తంగా 5,36,194 చ‌ద‌ర‌పు అడుగుల వైశాల్యంతో ఒక్కో రెసిడెన్షియ‌ల్ స్కూల్ నిర్మాణం విశాలంగా జ‌ర‌గ‌నుంది.

Also Read: Hardik Pandya: ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. హార్దిక్ పాండ్యా కొత్త లుక్ చూశారా?

ఇంజినీరింగ్ డిజైన్ల ఆధారంగా రేట్ల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని అంచనాలు అత్యంత పారదర్శకంగా తయారు చేయబడ్డాయి. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో నిర్మించిన స‌మీకృత జిల్లా కార్యాల‌యాల స‌ముదాయాలకు (IDOC) నిర్ణ‌యించిన రేట్లు.. ప్ర‌స్తుత యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్స్ సూళ్ల‌కు నిర్ణ‌యించిన రేట్ల‌ను ప‌రిశీలిస్తే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎంత పేల‌వ‌మైన‌వో తెలిసిపోతుంది.

సిద్దిపేట (IDOC)కి చ‌ద‌ర‌పు అడుగుకు రూ.4,058, సిరిసిల్ల (IDOC) కి చ‌ద‌ర‌పు అడుగుకి రూ.,4,990, ములుగు (IDOC) కి రూ.3,994, వ‌రంగ‌ల్ ఈస్ట్ (IDOC) కి రూ.4,875 గ‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అత్యాధునిక మౌలిక వ‌స‌తుల‌తో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూళ్ల నిర్మాణానికి చ‌ద‌ర‌పు అడుగుకు ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర కేవ‌లం రూ.3,730. గ‌త ప్ర‌భుత్వ కాలంలో రెండేళ్ల క్రితం చేప‌ట్టినా ఏ నిర్మాణంతో పోల్చుకున్నా ప్ర‌స్తుతం ఈ స్కూళ్ల‌కు నిర్ణ‌యించిన ధ‌ర చాలా త‌క్కువ. గ‌త ప్ర‌భుత్వ హయాంలో నిర్మాణాల క‌న్నా త‌క్కువ ధ‌ర నిర్ణ‌యించిన‌ప్పుడు వ్య‌యం పెంపు అనే ఆరోప‌ణ‌ల‌కు అర్ధం లేదు.

వెనుక‌బడిన వ‌ర్గాల పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌, వ‌స‌తి క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో ప్రారంభిస్తున్న ఈ స్కూళ్ల నిర్మాణ విష‌యంలో ప్రభుత్వ ప్రయత్నాలను అభినందించడానికి బదులుగా ప్రతిపక్షం తప్పుడు కథనాను ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డానికి తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తున్న ప్ర‌జా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించే ముందు త‌మ పాల‌న‌లో విద్యార్థుల‌కు జ‌రిగిన తీవ్ర అన్యాయాల‌పై ప్ర‌తిప‌క్ష పార్టీ ఆత్మవిమ‌ర్శ చేసుకోవాలి.