Site icon HashtagU Telugu

Wedding Groom Passed Away : పెళ్లైన 24 గంటల్లోపే వరుడు మృతి.. పాపం ఆ వధువు..

Same Blood Group

Same Blood Group

పెళ్లి(Marriage) అనగానే ఇటు అమ్మాయితో పాటు అటు అబ్బాయికి కూడా ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండాలని ఎన్నో ఆశలతో కొత్తజీవితంలోకి అడుగుపెడతారు. కానీ.. ఈ జంటను చూసి విధికి కన్నుకుట్టింది. వాళ్లిద్దరూ కలిసి ఉండటాన్ని చూడలేక.. పెళ్లై 24 గంటల్లోగానే వరుడి(Groom)ని మృత్యువు కబళించింది. కాళ్లపారాణి ఆరకుండానే భర్తను పోగొట్టుకున్న ఆ వధువు(Bride) ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. పచ్చని తోరణాలు వారి ఆనందాలను వెక్కిరిస్తుంటే ఇంటిల్లిపాదీ శోకసంద్రంలో మునిగిపోయారు.

స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు.. సిద్ధిపేట(Siddipet) మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన నిరంజన్ సిద్ధిపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమయింది. శనివారం (ఆగస్టు 2) వైభవంగా వివాహం జరిగింది. సోమవారం (ఆగస్టు 4) రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన పనులను నిరంజన్ స్వయంగా చూసుకునే బాధ్యత తీసుకున్నాడు. ఈ క్రమంలో మేడపైకి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ.. డెకరేషన్ లైటింగ్ వైర్లను సరిచేస్తున్నాడు. ఇంతలోనే నిరంజన్ కు విద్యుత్ షాక్ తగలడంతో కిందపడిపోయాడు.

నిరంజన్ ను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. కట్టిన తాళిబొట్టుకు ఉన్న పసుపు ఆరకుండానే.. భర్తను పోగొట్టుకున్న ఆ వధువు భవిష్యత్ ప్రశ్నార్థకం అయింది. వధువు బంధువులు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితిలో ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకుని పోగొట్టుకుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పెళ్లింట జరిగిన ఈ విషాదాన్ని చూసి గ్రామస్తులు కంటతడి పెట్టుకున్నారు.

 

Also Read : Thunderstorm : ఒడిశాలో పిడుగుల బీభత్సం.. ఏకంగా 2 గంటల్లో 61 వేల పిడుగులు