Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి

  • Written By:
  • Updated On - January 11, 2024 / 11:06 AM IST

Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు.

స్వాతంత్ర్య సమర యోధులు మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితర నేతల ఆశయాలను, మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, పారదర్శకత్వంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఆరు హామీలతో సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవిస్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పారిశ్రామిక పెట్టుబడులకు సంబంధించిన ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని దేశాలలో సత్సంబంధాలు కొనసాగించటానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో ప్రయత్నిస్తుందని తెలిపారు.

తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేయుటకు ముందుకు రావాలని కోరారు. అందుకు తగిన సూచనలు చేయాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జయేష్ రంజన్, హైదరాబాద్ రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ స్నేహజ , ఇతర అధికారులు పాల్గొన్నారు.

కాగా రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం తీసుకొస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. విద్యుత్తు రంగ నిపుణులు, వివిధ రాష్ట్రాల విద్యుత్తు విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో చర్చించి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విద్యుత్తు విధానాన్ని అమలుచేయాల్సిన అవసరముందని అన్నారు. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, డి. శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2 వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు.