కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) పర్యవేక్షణలో సర్వే బృందాలు రంగంలోకి దిగి రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల సరిహద్దుల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు, మార్కింగ్‌లు వేగవంతం చేశాయి. గత పది రోజులుగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు సాగే హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు, శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా సాగే హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌కు సంబంధించిన రూట్ సర్వేలు ముమ్మరంగా సాగుతున్నాయి.
సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పొలాలు, ఖాళీ స్థలాలు, ఇతర వ్యూహాత్మక ప్రాంతాలలో ఎరుపు, తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు వేస్తున్నారు. ఇప్పటికే యాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్‌గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మంతన గౌరెల్లి గ్రామాల పరిధిలో మార్కింగ్‌ల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ మార్కింగ్‌లు కారిడార్ ఎలైన్‌మెంట్, సర్వే పాయింట్లు, భవిష్యత్తులో అవసరమయ్యే భూసేకరణ పరిధిని గుర్తించేందుకు ఉపయోగపడతాయని అధికారులు వెల్లడించారు. ఈ హైస్పీడ్ రైలు కారిడార్‌లకు సంబంధించి ప్రాథమికంగా ఇప్పటికే ఏరియల్ సర్వేలను నిర్వహించారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రూట్‌ను ఖరారు చేసేందుకు, సాధ్యాసాధ్యాల అధ్యయనాన్ని ముగించేందుకు అధికారులు వేగంగా పనులు జరుపుతున్నారు. ఈ గ్రౌండ్ సర్వే పూర్తిగా ముగిసిన తర్వాత తుది ఎలైన్‌మెంట్, ఎక్కడెక్కడ బుల్లెట్ రైలు స్టేషన్లు ఏర్పాటు చేయాలి, ఎంత భూమి సేకరించాలి అనే పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.
ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాలకు ప్రయాణ సమయం కేవలం 2 నుంచి 3 గంటలకు తగ్గిపోనుంది. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రతిపాదించిన ఈ కారిడార్లను పూర్తిగా ఎలివేటెడ్ మార్గాలుగా నిర్మించే అవకాశం ఉంది. ఈ భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ద్వారా తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల ఆర్థిక, పారిశ్రామిక రంగాలు ఊహించని వృద్ధిని సాధిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
