Site icon HashtagU Telugu

Water Problem : హైదరాబాద్ లో మొదలైన నీటి కష్టాలు

Water Problems Hyd

Water Problems Hyd

హైదరాబాద్‌(Hyderabad)లో నీటి సమస్య (Water Problem) తీవ్రమవుతోంది. ఫిబ్రవరిలోనే భూగర్భజలాలు తగ్గిపోవడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వెస్ట్ జోన్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో వేసవికాలం మధ్యలో తలెత్తే సమస్య ఈసారి ముందుగానే మొదలైంది. ప్రజలకు అవసరమైన మేరకు జలమండలి ద్వారా సరఫరా లేకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ల ధరలు పెరిగిపోయాయి. ఒక ట్యాంకర్‌కు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీలలో నీటి కొరత తీవ్రంగా ఉంది. తాగునీరు సరిపడా అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ఇంకా పూర్తిగా ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉండగా, మున్ముందు ఎండలు పెరిగిన తర్వాత పరిస్థితి మరింత కష్టతరమవుతుందనే భయంతో ప్రజలు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో రెండు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. అటువంటి సందర్భాల్లో కూడా తక్కువ ప్రెషర్‌తో కేవలం 20 నిమిషాల పాటు మాత్రమే నీరు వస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

CM Chandrababu : వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు : సీఎం చంద్రబాబు

హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్, సుభాష్ చంద్రబోస్ నగర్, ప్రేమ్ నగర్ వంటి కాలనీల ప్రజలు నీటి సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి చెప్తున్న ప్రకారం గత ఏడాది నుండి తాగునీటి సరఫరా మరింత దారుణంగా మారింది. రోజువారీ అవసరాలకు కూడా నీరు అందకపోవడంతో ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కారణంగా అనేక మంది అధిక ధరలు చెల్లించి మరీ నీరు తెప్పించుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు తగినంత నీటి సరఫరా కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని సూచిస్తున్నారు. భూగర్భజలాల నిర్వహణను మెరుగుపరిచేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. చెరువులు, నీటి మూలాలను కాపాడడం, వర్షపు నీటి సంరక్షణ వంటి మార్గాలను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలికంగా సమస్యను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.