Vinod Kumar : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి చేసిన వ్యాఖ్యలపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ విభజన సమయంలో సురప్లస్ రాష్ట్రంగా ఉన్నప్పటికీ, గత పదేళ్లలో అప్పులు పెరిగాయని రాజ్యసభలో సీతారామన్ వ్యాఖ్యానించారు.
వినోద్ కుమార్ మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు నిర్లక్ష్యపూరితమైనవని తప్పుబట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే అమలులోకి వచ్చిందని స్పష్టంగా చెప్పారు. ఈ చట్టం రూపొందడంలో నైతికంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వానికో లేదా నిర్మలా సీతారామన్‌కో ఎటువంటి పాత్ర లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్ పార్టీ , ప్రజలు కలసి పోరాడారని గుర్తు చేశారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలనను నిర్మలా సీతారామన్ అప్రతిష్ఠపర్చేలా వ్యాఖ్యలు చేశారని బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ 1956లో ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయ్యే ముందు , 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు సురప్లస్ బడ్జెట్‌తో ఉన్నదని ఆయన గుర్తు చేశారు. అప్పులు పెరిగిన మాట వాస్తవమే అయినా, కేసీఆర్ సర్కారు ఆ అప్పులను సమర్థవంతంగా ఉపయోగించి రాష్ట్రానికి విలువైన ఆస్తులను సృష్టించిందని స్పష్టం చేశారు.
Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై అట్రాసిటీ కేసు
తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ నాయకత్వం లో జరిగిన ముఖ్యమైన ప్రాజెక్టులను వినోద్ కుమార్ వివరించారు. కొత్తగా జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు, కాలేశ్వరం ప్రాజెక్టు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి కీలక భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పరిపాలన సాగిస్తున్నారని గుర్తుచేశారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య రంగంలో తెలంగాణ పెద్ద కదలిక చూపిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం రాబడిన ఆదాయం ఐదు రెట్లు పెరిగినప్పటికీ, కేవలం అప్పుల గురించే మాట్లాడటం ఎందుకు అని వినోద్ కుమార్ నిలదీశారు. నిర్మలా సీతారామన్ రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటిస్తే ఇక్కడ అభివృద్ధిని స్వయంగా చూడగలరని సూచించారు. సీతారామన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని, దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రం కూడా కారణమని విమర్శించారు.
బీజేపీ నేతలు మేదక్ రైల్వే స్టేషన్ గురించి గొప్పలు చెప్పుకోవడం ఎట్లా సాధ్యం అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు పలు సంవత్సరాల పాటు ఆలస్యమయ్యిందని, చివరికి బీఆర్‌ఎస్ ప్రభుత్వ చొరవతోనే పూర్తి అయ్యిందని గుర్తు చేశారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని, పైగా తెలంగాణపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు.
Delhi New CM : ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు ..!