Site icon HashtagU Telugu

Victory Celebrations Of Public Governance: ఈనెల 7, 8, 9 తేదీలలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు!

Victory Celebrations Of Public Governance

Victory Celebrations Of Public Governance

Victory Celebrations Of Public Governance: ప్రజాపాలన విజయోత్సవాలలో (Victory Celebrations Of Public Governance) భాగంగా ఈనెల 7, 8, 9 తేదీలలో జరిగే ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై బుధ‌వారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ఉత్సవాల చివరి మూడు రోజుల్లో సచివాలయ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిచే తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణతోపాటు మూడు రోజుల పాటు సినీ రంగ ప్రముఖులచే మ్యూజికల్ నైట్, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డ్వాక్రా, రెస్టారెంట్లు, సంస్థలచే స్టాళ్ళ ఏర్పాటు, భారీ ఎత్తున డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్స్ షో తదితర కార్యక్రమాలుంటాయని వివరించారు. డిసెంబర్ 7వ తేదీన వందేమాతరం శ్రీనివాస్ బృందం, 8వ తేదీన రాహుల్ సిప్లిగంజ్, 9వ తేదీన థమన్ చే సినీ సాంస్కృతిక కార్యక్రమాలుంటాయని తెలిపారు.

Also Read: Devendra Fadnavis : దేవేంద్ర ఫడ్నవిస్ యావరేజ్‌ స్టూడెంట్.. టీచర్ సావిత్రి చెప్పిన విశేషాలు

ఈ నెల 9వ తేదీన ప్రధాన కార్యక్రమం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తారని, అనంతరం సభా కార్యక్రమం, గతంలో లేనివిధంగా డ్రోన్ షో, లేజర్ షో, క్రాకర్ ప్రదర్శన అనంతరం థమన్ చే ఐమాక్స్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుండి పీవీ మార్గ్ వరకు ఐదు కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికల్లో భిన్న రీతుల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే మార్గంలో ఫుడ్ స్టాళ్లు, హస్తకళల స్టాళ్లు, పలు శాఖల స్టాళ్లతో దాదాపు 120 స్టాళ్లను ఏర్పాటుచేస్తున్నామని తెలియచేసారు. యువతకై సెల్ఫీ పాయింట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ట్యాంక్ బండ్ నుండి రాజీవ్ గాంధీ జంక్షన్, సచివాలయం, ఇందిరా గాంధీ ఐమాక్స్ జంక్షన్ నుండి పీవీ నర్సింహా రావు మార్గ్ వరకు రంగు రంగుల విధ్యుత్ దీపాలతో అలంకరించాలని తెలిపారు.

ఈ మూడు రోజుల పాటు పెద్ద సంఖ్యలో నగర వాసులు వచ్చే అవకాశమున్నందున వారికి తాగునీరు, టాయిలెట్ల ఏర్పాట్లు, తగు భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా 9 వ తేదీన తెలంగాణా తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక లక్ష మంది హాజరయ్యే అవకాశమున్నందున తగు ఏర్పాట్లను చేయాలని అన్నారు. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో ప‌ర్యాట‌క‌ శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాష్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి, ADGP సంజయ్ కుమార్ జైన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.