Site icon HashtagU Telugu

Hyderabad Rains: హైదరాబాద్ అతలాకుతలం.. భారీ వర్షంతో భయానకం!

Rains1

Rains1

హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెల్లవారుజామునుంచే ఉరుములు ఉరమడంతో సిటీ జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దీనికితోడు మెరుపులు, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా భీకరంగా తయారైంది. ఆపై వర్షం దంచికొట్టడంతో హైదరాబాదీలంతా ఆందోళన చెందారు. అటు ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, మారేడ్ పల్లి, సికింద్రాబాద్, బేగంపేట్, సరూర్ నగర్, దిల్
సుఖ్ నగర్, నాగోల్, వనస్థలిపురం, పెద్ద అంబర్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్, ఈసీఐఎల్, కూకట్ పల్లి, మల్కాజ్ గిరి ఇలా చాలా ప్రాంతాల్లో వర్షం బాదేసింది.

సిటీలో వర్షం నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆ నీరంతా రోడ్లపైకి చేరింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇప్పటికే పలు కాలనీలు నీటిలో దిగ్బంధం అయ్యాయి. వర్షం భారీగా పడడం, ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరాను నిలిపేశారు. పలు కూడళ్లలో భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తప్పలేదు. మోకాళ్లు లోతు నీటిలో నడవాల్సిన పరిస్థితి ఎదురైంది. మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వెళ్లే దారిలో స్టేట్ హోమ్ దగ్గర చెట్టుకొమ్మలు విరిగిపడడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరదనీరు చేరింది. ఆ ప్రాంతంలో ఓ గుంతలో కారు ఇరుక్కుపోయింది. ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఇతర ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వేసవి తాపంతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీనికి ఉపరితల ద్రోణి ప్రభావమే కారణం. రేపు (05-05-2022) కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలపడంతో ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకుంటే మంచిది.