తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) గుడ్ న్యూస్ తెలిపారు. కేంద్ర రహదారులు మరియు మౌలిక సదుపాయాల నిధి (CRIF) కింద తెలంగాణ రాష్ట్రానికి రూ.868 కోట్లు మంజూరైనట్లు కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఈ నిధులతో రాష్ట్రంలో 34 రోడ్లు, వంతెనల అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేయనున్నారు. రాష్ట్ర రహదారి నెట్వర్క్‌ను బలోపేతం చేయడం, కనెక్టివిటీని పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడం ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం అని మంత్రి వివరించారు.
Beggars Homes: బెగ్గర్స్ హోమ్స్ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు సులభమైన రవాణా సౌకర్యం కలగనుంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. వంతెనలు, రహదారుల అభివృద్ధి వల్ల ప్రయాణ సమయం తగ్గి, రవాణా ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఆర్థిక కార్యకలాపాలపై సానుకూల ప్రభావం చూపించి, ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమతుల్య ప్రాంతీయాభివృద్ధికి కట్టుబడి ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రోడ్డు నెట్వర్క్ బలోపేతం ద్వారా పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ఈ నిధుల మంజూరుతో రాష్ట్ర రహదారి వ్యవస్థ మరింత బలపడటమే కాకుండా, ప్రాంతాల మధ్య సామాజిక-ఆర్థిక సమన్వయం మెరుగుపడే అవకాశం ఉందని ఆయన తెలిపారు.