Degradable Plastic: హైగ్రేడ్ బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ (Degradable Plastic)ను కేంద్ర మంత్రి జితేంద్రసింగ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబులు ఆవిష్కరించారు. గ్రీన్ వర్క్స్ బయో అనే సంస్థ హబ్సిగూడలోని సిఎస్ ఐఆర్-ఐఐసిటి సాంకేతిక సహకారంతో రూపొందించిన జీవ శైథిల్య (మట్టిలో కలిసిపోయే) ప్లాస్టిక్ ఉత్పత్తులను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజి మంత్రి డా. జితేంద్ర సింగ్, రాష్ట్ర పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ జీవ శైథిల్య ప్లాస్టిక్‌తో ఇళ్లలో ఉపయోగించే టేబుల్ వేర్, పరిశ్రమల అవసరాలకు తగిన విధంగా తయారు చేసిన ఉత్పత్తులను గ్రీన్ వర్క్స్ బయో మార్కెట్లోకి ప్రవేశ పెడుతుంది.
ఒక్కసారి వాడి వ్యర్థాలుగా పారేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ స్థానాన్ని ఈ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ భర్తీ చేసేలా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇటువంటి పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా అన్నారు. ఒక్కసారి మాత్రమే ఉపయోగపడే సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల తీవ్ర మైన కాలుష్య సమస్య ఉత్పన్నమవుతోందని ఆయన వెల్లడించారు. సంప్రదాయ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి సుస్థిరాభివృద్ధి వైపు పయనించడానికి నూతన ఆవిష్కరణలు తోడ్పడతాయని ఆయన తెలిపారు.
Also Read: Mohammed Siraj: మహ్మద్ సిరాజ్ గంటకు 181.6 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడా? నిజం ఇదే!
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కాలుష్య రహిత ఉత్పత్తుల పరిశోధనలను తెలంగాణా రాష్ట్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాల మేరకు పర్యావరణానికి పెను ప్రమాదంగా పరిణమించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరముందని చెప్పారు. అందులో భాగంగా బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉత్పత్తులు పెద్ద ఎత్తున అందుబాటులోకి రావాలని ఆకాక్షించారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు గ్రీన్ వర్క్స్ బయో లాంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని శ్రీధర్ బాబు ప్రశంసించారు. బయో ప్లాస్టిక్స్ వినియోగం అన్ని రంగాల్లో అవసరమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ ఐఆర్-ఐఐసిటి డైరెక్టర్ డా. డి. శ్రీనివాస రెడ్డి గ్రీన్ బయోవర్క్స్ డైరెక్టర్ రిషికారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.