kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

నివేదికలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) యాజమాన్యం అధికారికంగా స్పందించింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఇలాంటి ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కంపెనీ స్పష్టం చేసింది

Published By: HashtagU Telugu Desk
Condom Packet

Condom Packet

సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట్ భూంపల్లిలోని ఒక వైన్ షాపులో కొనుగోలు చేసిన కింగ్‌ఫిషర్ బీర్ బాటిల్‌లో వినియోగించకూడని అపరిశుభ్ర వస్తువు (కండోమ్ ప్యాకెట్) ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, నివేదికలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (UBL) యాజమాన్యం అధికారికంగా స్పందించింది. వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఇలాంటి ఆందోళనలను తాము అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. తమ బ్రూవరీస్‌లో అత్యంత కఠినమైన అంతర్జాతీయ నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తామని.. బాట్లింగ్ ప్రక్రియ అంతా పూర్తి నియంత్రిత వాతావరణంలో, అత్యాధునిక సాంకేతికత మధ్య జరుగుతుందని వివరించింది. ప్రభుత్వ నియంత్రణ సంస్థల ఉత్పత్తి ప్రమాణాలకు అనుగుణంగా ఎన్నో నాణ్యతా తనిఖీలు (Quality Checks) దాటిన తర్వాతే ప్రొడక్ట్ బయటకు వస్తుందని, ఇన్ని భద్రతా మార్గదర్శకాల మధ్య ఇలాంటి సంఘటన జరగడం పూర్తిగా అసంభవమని సంస్థ పేర్కొంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించి వాస్తవాలను వెలికితీసేందుకు తాము సంబంధిత భాగస్వాములు మరియు క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పూర్తిస్థాయిలో సమీక్షిస్తున్నట్లు యూబీఎల్ ప్రతినిధులు తెలిపారు. లభించిన ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు నివేదికల ప్రకారం తగిన తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తమ బ్రాండ్‌పై వినియోగదారులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరియు ఉన్నత నాణ్యతా ప్రమాణాలను అనుసరించడానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ప్రజల్లో అనవసరమైన భయాందోళనలకు కారణమయ్యే, ఇంకా అధికారికంగా ధృవీకరించని ఎలాంటి సమాచారాన్ని గానీ, వీడియోలను గానీ పంచుకోవద్దని మీడియా వేదికలను, ప్రజలను కంపెనీ యాజమాన్యం గట్టిగా కోరింది.

  Last Updated: 20 May 2026, 09:45 PM IST