Ujjaini Mahankali Bonalu : ఉజ్జయినీ మహాంకాళి ఆలయంలో ఈరోజు (సోమవారం) రంగం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. బోనాల పండుగ అనంతరం ప్రతీ యేటా ఆలయంలో జరిగే ఈ విశిష్ట కార్యక్రమం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రంగంలో అమ్మవారి ప్రతినిధిగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చేసిన తీరు భక్తులను ఆకట్టుకుంది. సంప్రదాయానుసారం అమ్మవారి ముందు పచ్చికుండపై నిలబడి స్వర్ణలత భవిష్యవాణి చేశారు. ఈ యేడాది వర్షాలు బాగా కురుస్తాయి. పాడిపంటలు పుష్కలంగా వృద్ధి చెంది రైతులకు ఆనందం కలిగిస్తాయి అని తెలిపారు. అయితే భవిష్యవాణిలో కొంత గంభీరతను కూడా ఆమె ప్రతిబింబించారు.
Read Also: Saina Nehwal : వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన సైనా-కశ్యప్
నా భక్తులు సమర్పించిన బోనాలను నేను హర్షంగా స్వీకరించాను. కానీ ప్రతీ యేటా ఎవరో ఒకరు ఆటంకం కలిగిస్తున్నారు. నాకు చేప్పిన కోరికలు నెరవేర్చడం లేదు. పూజలను సరైన విధంగా నిర్వహించకపోతే… నేను కోపంగా మారితే, నా కన్నెర్ర చేస్తే రక్తం కక్కుతూ ప్రాణాలు కోల్పోతారు. కానీ నేను కోపంగా లేను. నాకు అన్నీ శాస్త్రోక్తంగా జరగాలి. నన్ను కొలిచే వారు నియమ నిష్టలతో పూజలు జరపాలి అని ఆమె హెచ్చరించారు. ఈ సంవత్సరం కూడా మహమ్మారి మళ్లీ ప్రబలే అవకాశముంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి. ముందుగానే హెచ్చరిస్తున్నా. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలి. ఐదు వారాలు పప్పు, పలహారాలతో ఉపవాసంగా ఉండి పసుపు కుంకుమలతో నన్ను పూజించండి. మీ కోరికలన్నీ నేను తీరుస్తాను. నేను మహంకాళిని మీ కొంగు బంగారం అని స్పష్టంగా వెల్లడించారు.
ఈ భవిష్యవాణి కోసం వేలాది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి రూపంలో స్వర్ణలత మాట్లాడుతూ చేసిన హెచ్చరికలు, ఆశీర్వాదాల కలయిక భక్తుల్లో భక్తిభావాన్ని రేకెత్తించాయి. రంగం కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. కార్యక్రమానంతరం అమ్మవారి అంబారి ఊరేగింపు ఘనంగా ప్రారంభం కానుంది. ఈ ఊరేగింపు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే సాయంత్రం ‘పలమార బండ్ల ఊరేగింపు’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈసారి ఊరేగింపును మరింత వైభవంగా చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలోని శ్రీ కరిబసవ స్వామి మఠం నుంచి 33 ఏళ్ల ఆడ ఏనుగు లక్ష్మీని తెలంగాణకు తీసుకొచ్చారు. జూలై 12న అటవీ శాఖ అనుమతుల మేరకు అన్ని చట్టబద్ధమైన జాగ్రత్తలతో లక్ష్మీని హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో భక్తుల ఉత్సాహం ఊపందుకుంది. ఉరేగింపు సందర్బంగా ప్రత్యేక శోభాయాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షం పొందేందుకు ఆలయం వద్దకు చేరుకుంటున్నారు.
Read Also: Space Policy : స్పేస్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం