SLBC Tunnel : 17వ రోజు నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ (40)గా గుర్తించారు. గురుప్రీత్ సింగ్ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తీసుకువచ్చిన తర్వాత సహాయకచర్యల్లో పురోగతి కనిపించింది. కేరళ పోలీస్ విభాగానికి చెందిన ఈ జాగిలాలు… మట్టిలో 15 అడుగుల కింద ఉన్న మృతదేహాల ఆనవాళ్లను కూడా పసిగట్టగలవు.
Read Also: IIFA Awards 2025: ‘లాపతా లేడీస్’కు 10 ‘ఐఫా’ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో
కాగా, ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో గత నెల 22న చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్ గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరన్‌తరాన్. ఆయనకు భార్య రాజేందర్ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాబిన్స్ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు.
Read Also: MLA Kota : ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు