Site icon HashtagU Telugu

Turmeric Board Telangana : 9 ఏళ్ల తర్వాత చెప్పులు ధరించిన పసుపు రైతు

Team India Defeat

Modi Turmeric Board Telanga

పసుపు రైతుల (Turmeric Farmers) దశాబ్దాల కల నెరవేరింది.. కొన్నేళ్లుగా కర్షకులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కళ్లు కాయలు కాచేలా చూస్తున్న పసుపు అన్నదాతల ఆకాంక్ష నెరవేరింది. తెలంగాణలో పసుపు బోర్డు (Turmeric Board Telangana) ఏర్పాటకు ప్రధాన మంత్రి మోడీ (PM Modi) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎట్టకేలకు జాతీయ పసుపు బోర్డు ప్రకటనతో రైతుల కల నెరవేరినట్లయింది. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించిన ప్రజాగర్జన సభ (Modi Prajagarjana Sabha )లో ప్రధాని మోడీ పసుపు బోర్డును ప్రకటించారు. రాష్ట్రానికి పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని ప్రతిజ్ఞ చేసిన ఓ రైతు 9 సంవత్సరాల తర్వాత నిన్న చెప్పులు ధరించాడు.

బాల్కొండ నియోజకవర్గంలోని పాలెం గ్రామానికి చెందిన పసుపు రైతు ముత్యాల మనోహర్‌రెడ్డి  (Farmer Muthyala Manohar Reddy)తొమ్మిదేళ్ల తర్వాత కాళ్లకు చెప్పులు ధరించారు. పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు ధరించబోనని 2014లో ఆయన ప్రతినబూనారు. పసుపు బోర్డు కోసం రైతులతో కలిసి పాదయాత్ర చేసిన ఆయన అప్పటి నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నారు. నిన్న ప్రధాని పసుపుబోర్డు ప్రకటించడంతో తిరిగి ఆయన చెప్పులు ధరించారు.

అసలు ఈ పసుపు బోర్డు (Turmeric Board) ఎందుకు..? ఈ బోర్డు వల్ల తెలంగాణ రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది..?

పాత నిజమాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో పసుపు విపరీతంగా పండుతుంది. దీంతో ఇక్కడి రైతులు విస్తృతంగా సాగు చేస్తారు. ఇక్కడ పసుపు బోర్డు ఉంటే తమకు మేలు జరుగుతుందని రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. పంట అభివృద్ధి, విస్తరణ, నాణ్యత ప్రమాణాలు పాటించడంవంటి అంశాలపై పరిశోధనలు జరిపి సలహాలు ఇవ్వడం, రైతులకు లాభం చేకూరేలా పసుపు ఎగుమతులకు అనువైన పరిస్థితులు కల్పించడం లక్ష్యంగా ఇక్కడ ఒక పసుపు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని స్థానిక రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని ఇక్కడి రైతుల వాదన

వాస్తవానికి కేవలం పసుపే కాకుండా, ఇతర అన్నిరకాల సుగంధ ద్రవ్యాలకూ కలపి 1987లో సుగంధ ద్రవ్యాల బోర్డు కేరళలోని కోచిలో ఏర్పాటైంది. రైతు ప్రయోజనాలు, పరిశోధన, గిట్టుబాటు ధర వంటి చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. స్పైసెస్ బోర్డు 52 సుగంధ ద్రవ్యాల కోసం పనిచేస్తుంది. వాటిలో పసుపు ఒకటి. దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని ఇక్కడి రైతుల వాదన.‌ ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపుపైనే దృష్టి పెడుతుంది. లేదంటే సలహాలు, సూచనలు, పరిశోధనల కోసం రైతులు కోచి స్పైసెస్ బోర్డుపైనే ఆధారపడాల్సి ఉంటుందని రైతులు వాదిస్తున్నారు. 2017 ఆగష్టులో అప్పటి ఎంపీ కవిత పసుపు బోర్డు ఏర్పాటు కోసం ప్రధాని మోదీని కలిశారు. 2018లో సురేశ్‌ ప్రభు స్పైసెస్ డెవలప్‌మెంట్‌ పార్క్ ప్రకటించారు.

2018లో పసుపు బోర్డు ఎన్నికల అంశంగా మారింది. అప్పటి ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178మంది రైతులు నామినేషన్లు వేశారు.బీజేపీ ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డును తీసుకురాకపోతే రాజీనామా చేస్తా’’ అని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన ధర్మపురి అరవింద్ ఈ ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత పసుపు బోర్డు తీసుకరాలేకపోయారు. ఇక ఇప్పుడు తెలంగాణ లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బిజెపి చూస్తుంది. ఈ క్రమంలో పసుపు బోర్డు ప్రకటిస్తే..ఎన్నికల సమయంలో బాగా ఉపయోగపడుతుందని గ్రహించిన మోడీ..ఇప్పుడు పసుపు బోర్డు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

జాతీయ పసుపు బోర్డు (Turmeric Board) ప్రకటించడంపై రైతులతో పాటు బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా రైతులు, కమలం కార్యకర్తల సంబురాలు అంబరాన్నంటాయి. మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఈ ప్రాంత రైతులకు చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేరని కొనియాడారు. మరోవైపు జాతీయపసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ హర్షం వ్యక్తం చేశారు.

ప్రధాని మోడీకి నిజామాబాద్‌ ఎంపీ కృతజ్ఞతలు

తెలంగాణ పసుపు రైతుల అభివృద్ధి కోసం పసుపు బోర్డు ప్రకటించిన మోదీ జీకి కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ బోర్డు నిజామాబాద్ రైతుల ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బోర్డుతో పసుపు రైతులకు గిట్టుబాట ధర లభించడమే కాదు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తుంది. పసుపు కేవలం పంట మాత్రమే కాదు. ఇది మన సంస్కృతిలో అంతర్భాగం. పసుపును ఆరోగ్యానికి, వంటల్లో, సంప్రదాయపరంగా వినియోగిస్తారు. పసుపు బోర్డు ప్రకటించడం వంటి చారిత్రక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి రైతుల తరఫున, బీజేపీ శ్రేణుల తరఫున ధన్యవాదాలు. అని అర్వింద్ ట్వీట్​లో పేర్కొన్నారు.

ఎంపీ అర్వింద్ ట్వీట్​ను రీ ట్వీట్ చేసిన ప్రధాని.. “మన రైతుల శ్రేయస్సు,సౌభాగ్యాలే ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. జాతీయ పసుపు బోర్డు‌ను ఏర్పాటు చేయడం ద్వారా, మన పసుపు రైతుల సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడం, వారికి తగిన మద్దతును అందించడమే మా లక్ష్యం. ముఖ్యంగా దీనిద్వారా నిజామాబాద్‌కు అందే ప్రయోజనాలు అపారం. మన పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు మేము ఎంతవరకైనా వెళ్తాం, ఏమైనా చేస్తాం.” అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

Read Also : Ration Card KYC : రేషన్‌ కార్డు కేవైసీకి గడువుపై క్లారిటీ.. పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన