Site icon HashtagU Telugu

Student Suicide: TSPSC పేపర్ లీక్ ఎఫెక్ట్.. నిరుద్యోగ యువకుడు ఆత్మహత్య!

Sucide

Sucide

తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహరం కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు మరో మూడు పరీక్షలు రద్దు చేయడంతో నిరుద్యోగులు, విద్యార్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకోవడం మరింత కలిచివేస్తోంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, బివై నగర్ లో చోటుచేసుకుంది.

ఇంట్లో ఉరేసుకొని

చిటికెన నాగభూషణం, సుశీల దంపతులకు నలుగురు కుమారులు. వీరందరిలో చిన్నవాడైన నవీన్ కుమార్(30) హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేసి.. ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే పలు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడటంతో.. వాటికి ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాయగా.. అందులో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెరమీదకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటన చేసింది. కల నెరవేరుతుందన్న సమయాన ఉన్న ఒక అవకాశం పోవడంతో.. అతడు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇక తనకు ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదని తీవ్ర నిరాశకు గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు.

కేసీఆర్ రాక్షస పాలనకు నిరుద్యోగి బలి : రేవంత్ రెడ్డి

‘‘కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి (Suicide) బలయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడి గ్రూప్ -1 కు ప్రిపేరైన సిరిసిల్లకు చెందిన నవీన్ కుమార్ తాజా లీకేజీ పరిణామాలతో మనస్థాపానికి గురై ఉరికొయ్యకు వేలాడాడు. కేసీఆర్ పై హత్యనేరం కింద కేసు పెట్టాలి. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. రూ.కోటి పరిహారం ఇవ్వాలి. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. మీకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. పోరాటం చేద్దాం’’ అంటూ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.

Also Read: Virat Kohli & Ram Charan: విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్!