Mahesh Kumar Goud : తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సంబంధించిన కొత్త కోణం బయటికి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ సారథిగా నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఆయన.. తాజాగా కరాటే బ్లాక్‌బెల్ట్ డాన్ 7ను అందుకున్నారు. ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ దీన్ని ప్రదానం చేసింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లిలోని వైడబ్ల్యూసీఏలో 3 గంటల పాటు జరిగిన కరాటే పరీక్షలో పాసైన అనంతరం మహేష్ కుమార్‌గౌడ్‌కు ఈ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో మహేశ్ కుమార్ గౌడ్‌కు ప్రావీణ్యం ఉంది. టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత కూడా ఆయన తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.
Also Read :MLC Election: హైదరాబాద్ ‘లోకల్’ ఎమ్మెల్సీ.. గెలుపు ఆ పార్టీదే
కరాటే నా జీవితంలో ఒక భాగంగా మారింది : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్
‘‘కరాటే నా జీవితంలో ఒక భాగంగా మారింది. ఈతరం పిల్లలకు చదువుతో పాటు క్రీడలు, కొద్దిపాటి వ్యాయామం కూడా అవసరమే. నేను ఎంత బిజీగా ఉన్నా కరాటేకు తప్పకుండా కొంత సమయం కేటాయిస్తాను. కరాటే బ్లాక్‌బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్‌ను తీసుకోవడం గర్వంగా, సంతోషంగా ఉంది. కరాటే పోటీల్లో భాగంగా నేను పలు దేశాల్లో పర్యటించాను. ఆసియా కరాటే పోటీలను 2027లో హైదరాబాద్‌లో నిర్వహిస్తాం’’ అని బ్లాక్ బెల్ట్ డాన్ 7 సర్టిఫికెట్ పొందిన అనంతరం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్ పేర్కొన్నారు.
Also Read :TDP : టీడీపీ జెండా పట్టుకొని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన కళ్యాణ్ రామ్
టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ గురించి..
- కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUIలో చేరడం ద్వారా మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయ జీవితం ప్రారంభమైంది.
- 1994లో ఆయన డిచ్ పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
- 2013 నుంచి 2014 వరకు ఆయన ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
- మహేష్ కుమార్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) 1993లో గౌతమీ కాలేజీని స్థాపించారు. తద్వారా విద్యారంగంలోనూ ఆయన సేవలు అందిస్తున్నారు.
- మర్రి చెన్నారెడ్డికి సన్నిహితుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పేరొందారు.
- 2004లో లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ భావించారు. అయితే అవకాశం దక్కలేదు. దీంతో ఆయన అప్పట్లో పార్టీని వీడారు. టీడీపీలో చేరారు.
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక.. ఒక ఫంక్షన్‌లో మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిశారు. మహేశ్ చేతులను వైఎస్సార్ పట్టుకొని, ‘‘నేను సీఎం అయ్యాక కూడా మీరు కాంగ్రెస్‌లోకి రాకుంటే ఎలా.. ’’ అన్నారు. వెంటనే కేశవరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని మహేశ్‌కు సూచించారు. దీంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.
- టీడీపీలో చేరిన నాలుగున్నర నెలలకే ఈ విధంగా మళ్లీ కాంగ్రెస్ గూటికి మహేశ్ కుమార్ గౌడ్ తిరిగి వచ్చేశారు.