Thummala Nageswara Rao : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుల పట్ల బ్యాంకర్లు చూపిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం రుణం చెల్లించలేదనే కారణంతో ఓ రైతు ఇంటి గేటు తీసుకెళ్లిన ఘటనను ఆయన ఖండించారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్ వేదికగా తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను వారు సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనంతరం ప్రసంగంలో తుమ్మల నాగేశ్వరరావు, బ్యాంకర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. “రుణం తిరిగి చెల్లించలేదనే కారణంతో రైతు ఇంటి గేటు తీసుకెళ్లారని పత్రికల్లో చదివాను. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కానీ, అదే బ్యాంకులు వేల కోట్లు ఎగ్గొట్టిన కార్పొరేట్లను ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాయి?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
KTM 390 Duke: కేటీఎం ప్రీమియం బైక్ 390 డ్యూక్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!
తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “వేల కోట్లు రూపాయల రుణాలు ఎగ్గొట్టిన వారిని ఎందుకు వదిలేస్తున్నారు? వారి నుంచి నగదు రికవరీ చేయడంలో ఎందుకింత చేతగానితనం? రైతుల దగ్గరికి రికవరీ కోసం వెళ్లే ధైర్యం చూపుతున్న బ్యాంకర్లు, పెద్దల వద్దకు ఎందుకు వెళ్లలేరు?” అని ఉద్ఘాటించారు. బ్యాంకింగ్ రంగం వ్యవసాయాన్ని పెంచిపోషించాల్సిన అవసరముందని తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతుల పట్ల దయ, గౌరవం చూపాలని బ్యాంకర్లకు హితవు పలికారు. “రైతులు అడుక్కునే వారు కాదు… రైతులే ఆహార భద్రతను కాపాడేవారు. బ్యాంకులు ఇచ్చే వారు, రైతులు అడుక్కునే వారు అనే భావనను విసర్జించాలి,” అని తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు.
రైతులపై కఠినంగా వ్యవహరించే బ్యాంకర్లు, పెద్దల రుణ ఎగ్గొట్టింపులపై ఎందుకు మౌనం పాటిస్తున్నారో ఆయన ప్రశ్నించారు. “రైతులకు ఇచ్చిన రుణాల మొత్తం ఎంత? అందులో ఎగ్గొట్టిన శాతం ఎంత? అలాగే వ్యవసాయేతర రుణాల మొత్తం ఎంత? ఆ విభాగంలో ఎగ్గొట్టిన మొత్తం ఎంత? ఒకసారి ఈ లెక్కలు బయట పెట్టాలని” తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు స్నేహపూర్వకంగా ఉండాలని, వారి అవసరాలను అర్థం చేసుకుని సహాయం చేయాలని సూచించారు. “రైతులు బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది. వ్యవసాయరంగం బలపడితే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది” అని అన్నారు.