Secunderabad Railway Station: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలో అత్యంత బిజీగా ఉండే రైల్వే స్టేషన్ సికింద్రాబాద్. ఇక్కడి నుంచి రోజూ వందకుపైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజూ 1.60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నిజాం పాలనా కాలంలో 1874లో సికింద్రాబాద్‌లో రైల్వేస్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ స్టేషన్‌లో మూడు ప్లాట్‌ఫాంలు ఉండేవి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1952లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కోసం మూడు ఐకానిక్ ఆర్చీలతో మరో భవనాన్ని నిర్మించారు. విడతలవారీగా ఈ స్టేషనులోని రైల్వే ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను 10కి పెంచారు. ఇకపై ఈ స్టేషనులో ఉన్న మూడు ఐకానిక్ ఆర్చీలు కనిపించవు. ఎందుకు ?
Also Read :Ganga Tiger : గంగానదిలో పెద్దపులులు.. ఏమిటివి ? వాటికి ఏమవుతోంది ?
మూడు ఆర్చ్‌ల గురించి..
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) అనగానే అందరికీ మూడు ఆర్చ్‌లు గుర్తుకు వస్తాయి.
- ఈ మూడు ఆర్చ్‌లలోని ప్రవేశ ద్వారాల శిఖరాన తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఒక్కో దానిపై సికింద్రాబాద్ అనే అక్షరాలు పెద్దగా ఉంటాయి. వాటిని సగటున కిలో మీటర్ దూరం నుంచి కూడా చూడొచ్చు.
- ఈ రైల్వే స్టేషనులో ఏ భాషలో ఉన్న ఆర్చీ కింద నిలబడాలో.. ఇక్కడికి కొత్తగా వచ్చే ప్రయాణికులకు వారి బంధువులు చెబుతుండే వారు.
- ఇటీవలే హిందీ, ఇంగ్లిష్ భాషల అక్షరాలు కలిగిన ఆర్చీలను కూల్చారు. తెలుగు అక్షరాలు కలిగిన ఆర్చీని రేపటికల్లా కూల్చివేయనున్నారు.
Also Read :Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఎవరు ?
ఎందుకీ కూల్చివేతలు ?
అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను నిర్మిస్తున్నారు. అందుకే ఈ స్టేషనులోని పాత భవనాలు, కట్టడాలను కూల్చేస్తున్నారు. రూ.720 కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. మొత్తం రైల్వే స్టేషన్‌ను రీడెవలప్ చేయనున్నారు. ఏడాదిలోగా పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవైపు కూల్చివేత పనులు చేస్తూనే, మరోవైపు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ పనులు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే రెస్టారెంట్లు, మల్టీ లెవల్ పార్కింగ్ వసతులు, ఎంటర్‌టైన్‌మెంట్ స్టాళ్లు, ఎస్కలేటర్ల తరహాలో వాకింగ్ ట్రాక్‌లు, లిఫ్ట్‌లు అందుబాటులోకి తీసుకొస్తారు. అంతర్జాతీయ విమానాశ్రయంలా కనిపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను మార్చనున్నారు.