Site icon HashtagU Telugu

KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్‌

There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR

There is nothing wrong with writing a letter to the party leader..internal matters..should be discussed internally: KTR

KTR : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాయడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ నాయకుడికి లేఖ రాయడంలో తప్పేం లేదని ఆయన పేర్కొన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థ ఉందని, ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే లేదా సూచనలు చేయాలంటే లేఖల రూపంలోనైనా చెప్పవచ్చని స్పష్టం చేశారు.‘‘ఇవి అంతర్గత విషయాలు కావడంతో, అంతర్గతంగానే చర్చలు జరగడం మంచిది. కానీ ప్రతి పార్టీకి లొల్లి పెట్టే కోవర్టులు ఉంటారు. వారు సమయం వచ్చినప్పుడు స్వయంగా బయటపడతారు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read Also: TS POLYCET : తెలంగాణ పాలిసెట్‌-2025 ఫలితాలు విడుదల

ఇక, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ, కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానానికి నిధులు అందిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాటల సీఎం కాదు, మూటల సీఎం. ఆయన పదవి కాపాడుకోవడం కోసం ఢిల్లీ పెద్దల ముందు చాకిరి చేస్తున్నాడు. ఆయనకు ఢిల్లీలో ఇద్దరు బాస్‌లు ఒకరు రాహుల్ గాంధీ, మరొకరు ప్రధాని మోడీ. వీరిద్దరి చేతుల్లోనే ఈ ప్రభుత్వం నడుస్తోంది అని విమర్శించారు.

ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్‌రెడ్డి పేరు ఉండగా ఇప్పటికీ ఆయన, రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఒకవేళ బీజేపీ నేతల పేర్లు ఉంటే ఇప్పటికే వారిని రాజీనామా చేయించేవారు. మరి రేవంత్‌కు ప్రత్యేక రాయితీలు ఎందుకు? గతంలో అనేకమంది సీఎంలు, కేంద్ర మంత్రులు ఆరోపణల నేపథ్యంలో రాజీనామాలు చేశారు. మరి రేవంత్ ఎందుకు చేయడం లేదు? అని నిలదీశారు.

కేటీఆర్ మాట్లాడుతూ, గత మే నెలలో ప్రధాని మోడీ తెలంగాణలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌’ నడుస్తుందని చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఏ విచారణా జరగలేదని విమర్శించారు. ‘‘రాష్ట్రం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా అప్పులు చేస్తూ, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? రేవంత్‌రెడ్డిని కాపాడటం కోసమేనా ఈ మౌనం?’’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ – కాంగ్రెస్ మధ్య రాజకీయ దాడులు మళ్లీ వేడెక్కినట్టు స్పష్టమవుతోంది. పార్టీ అంతర్గత వ్యవహారాల నుండి రాష్ట్ర రాజకీయాల వరకు వివిధ అంశాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, మరిన్ని చర్చలకు దారితీయనున్నాయి.

Read Also: Jogi : అడ్డంగా దొరికిపోయిన జోగి రమేష్..ఇక జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనా..?