BRS : తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారత్ రాష్ట్ర సమితి (BRS)కు కోలుకోలేని దెబ్బ తీశాయి. గత 2020 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పదికి పది మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ, ఈసారి కేవలం ఆరు ఏళ్ల వ్యవధిలోనే ఒక్క కార్పొరేషన్‌లో కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోలేక ‘జీరో’ దగ్గరే ఆగిపోయింది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం వంటి కీలక నగరాల్లో పరాజయం చెందడం ఆ పార్టీ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చింది. నిన్నటి వరకు ఎదురులేని శక్తుల్లా వెలిగిన కార్పొరేషన్లు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీల పరం కావడంతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
మున్సిపాలిటీల్లోనూ అదే దెబ్బ-పట్టు కోల్పోయిన గులాబీ కోటలు
మొత్తం 116 మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్ కేవలం 18 చోట్ల మాత్రమే ఛైర్మన్ పదవులను కైవసం చేసుకోగలిగింది. ఇందులోనూ కేవలం 13 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండగా, మిగిలిన 5 చోట్ల కాంగ్రెస్ లేదా ఇతరులతో పొత్తులు పెట్టుకుని అతికష్టమ్మీద పదవులను దక్కించుకోవాల్సి వచ్చింది. 2020లో 120కి పైగా మున్సిపల్ ఛైర్మన్ పదవులను గెలుచుకున్న ఆ పార్టీ, ఇప్పుడు కనిష్ఠ స్థాయికి పడిపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. సిరిసిల్ల, గజ్వేల్ వంటి సొంత కోటల్లో పట్టు నిలుపుకున్నప్పటికీ, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లో పార్టీ నామరూపాల్లేకుండా పోయింది.
పతానికి కారణమేంటి?
బిఆర్ఎస్ పతనానికి ప్రధాన కారణం అధికార వ్యతిరేకతతో పాటు క్షేత్రస్థాయిలో కేడర్ చేజారిపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా చోట్ల కాంగ్రెస్-బీజేపీలు రహస్య ఒప్పందాలతో బిఆర్ఎస్‌ను దెబ్బతీశాయని ఆ పార్టీ నేతలు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు, కరీంనగర్‌లో బిఆర్ఎస్ తప్పుకోవడంతో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్-బీజేపీలు కలిసి ఛైర్మన్ పదవులను పంచుకున్నాయి. ఈ ‘అపవిత్ర పొత్తుల’ వల్లే తమకు మెజార్టీ ఉన్నా పదవులు దక్కలేదని బిఆర్ఎస్ వాదిస్తున్నప్పటికీ, ఓటర్ల తీర్పు మాత్రం స్పష్టంగా మార్పు కోరుకున్నట్లు కనిపిస్తోంది.
