తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ (Bathukamma) పండుగలో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా ఎంచగూడెంకు చెందిన మౌనిక (32) ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ ఆడేందుకు వెళ్లారు. అయితే అక్కడ డీజే సౌండ్(DJ Sound) కారణంగా ఆమె అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. మౌనికకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండటం వల్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Hussain Sagar 2.0: హుస్సేన్‌సాగర్ నయా లుక్..స్కై వాక్ తో పాటు మరెన్నో !!
ఇక మరో ఘటన సంగారెడ్డి జిల్లా మాచిరెడ్డిపల్లిలో జరిగింది. మేఘన (24) స్థానికంగా బతుకమ్మ ఆడుతూ ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పండుగ సందర్భంలో ఆనందంగా గడపాలని వచ్చిన యువతి ఆకస్మిక మరణంతో ఆ గ్రామంలో దుఃఖ వాతావరణం నెలకొంది.
ఈ రెండు సంఘటనలు బతుకమ్మ ఉత్సవాలను ఆనందోత్సాహాలనుంచి దుఃఖంలోకి మలిచాయి. పూలపండుగను జరుపుకుంటూ వేలాది మంది మహిళలు ఒకచోట చేరుతారు. ఇలాంటి సందర్భాల్లో గుండె సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అధిక శబ్దంతో వినిపించే డీజే సౌండ్ కూడా గుండె సంబంధిత సమస్యలున్న వారికి హానికరమని గుర్తు చేస్తున్నారు. బతుకమ్మ పండుగలోని ఈ విషాదాలు సమాజానికి ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన అవసరాన్ని మరింతగా గుర్తు చేస్తున్నాయి.
