Ration Cards : ‘‘రేషన్ కార్డు ఉంది.. కానీ కుటుంబంలోని అందరి పేర్లు అందులో లేవు.. కొందరి పేర్లే ఉన్నాయి.. వారి వరకే రేషన్ వస్తోంది..’’ ఇది తెలంగాణలోని ఎంతోమంది రేషన్ కార్డు కలిగిన వారి సమస్య. కొందరి రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు లేవు.. ఇంకొందరి రేషన్ కార్డుల్లో కోడళ్ల పేర్లు లేవు.. ఇలా ఒక్కో కుటుంబం ఒక్కో రకమైన సమస్య వల్ల అందాల్సిన రేషన్ సరుకులను కోల్పోతోంది. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారాన్ని చూపించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ సిద్ధం అవుతోంది.
Also Read :Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్.. దీపికా కుమారికి రజతం
- రేషన్ కార్డుల్లో తమ కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటూ తెలంగాణవ్యాప్తంగా దాదాపు 11.08 లక్షల మంది మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఆ దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ(Ration Cards) ఆమోదించలేదు.
- రేషన్ కార్డుల్లో కొత్త వారి పేర్లను చేరిస్తే ప్రతినెలా దాదాపు 9,890 టన్నుల బియ్యాన్ని అదనంగా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.37.40 కోట్ల భారం పడుతుందని అంచనా.
- తొలుత ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుతమున్న రేషన్ కార్డులలోని లబ్ధిదారుల సమాచారాన్ని ఫ్యామిలీ డిజిటల్ కార్డులలో చేర్చేలా సాఫ్ట్‌వేర్‌ను రెడీ చేయనున్నారు.
- ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో రేషన్ షాపునకు వెళ్లి.. అక్కడ ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ వెంటనే సదరు కుటుంబానికి ఏయే సరుకులు, ఎంతమేర ఇవ్వాలనేది డిస్‌ప్లే అవుతుంది. దాని ప్రకారం వారికి రేషన్‌ను ఇస్తారు.
- తదుపరిగా రేషన్ కార్డుల్లో కొత్త వారిని చేర్చే ప్రక్రియను మొదలుపెట్టే అవకాశం ఉంది. కొత్తవారి చేరికకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆమోదం తెలిపిన వెంటనే.. ఆ పేర్లు, వివరాలు కూడా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో చేరిపోతాయి.
- ఈ ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తారని సమాచారం.