Medaram Jathara : వచ్చే సంవత్సరం మేడారం జాతర కోసం తేదీలు ఫిక్స్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన డేట్స్‌ను మేడారం పూజారులు నిర్ణయించారు. 2025 సంవత్సరం ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు మేడారం మినీ జాతర జరుగుతుంది. ఈమేరకు మేడారం పూజారులు(Medaram Jathara) ఓ ప్రకటన విడుదల చేశారు. ఆలయ ఈవోకు ఆహ్వాన పత్రం పంపారు. మినీ మేడారం జాతర సందర్భంగా గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురారు.
Also Read :Diwali 2024 : దీపావళి రోజున మీ ఇంటిని ఇలా అద్దాలను ప్రకాశింపజేయండి..!
మేడారం వీరగాథ
- కాకతీయులు ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించారు. మేడారం ప్రాంతం కూడా కాకతీయుల రాజ్యం పరిధిలోకే వచ్చేది.
- కాకతీయుల సేనలు ప్రతి సంవత్సరం తమకు కప్పం కట్టాలంటూ మేడారం, పరిసర ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీలను ఇబ్బందిపెట్టేవి.
- కాకతీయుల సేనల వేధింపులను తాళలేక వీరత్వంతో పోరాడిన వాళ్లే మన సమ్మక్క-సారలమ్మలు.
- సమ్మక్క-సారలమ్మలు, వారి కుటుంబ సభ్యుల వీరగాథలకు గుర్తుగా ఏటా మేడారం జాతరను జరుపుకుంటారు.
- మేడారం జాతర 1944 వరకు ఆదివాసీలు, గిరిజనులకే పరిమితమైంది. ఆ తర్వాతి నుంచి అన్ని వర్గాల వారు ఈ జాతరలో భాగస్తులయ్యారు.
- ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర. దీన్ని తెలంగాణ కుంభమేళా అని పిలుస్తారు.
- మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది.
- మేడారం మహాజాతర అనేది మండ మెలిగే పండుగతో మొదలవుతుంది. అనంతరం వన దేవతలను గద్దెల వద్దకు తెస్తారు.
- తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఈ జాతరకు భక్తులు వస్తుంటారు.
- దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తున్నందున మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి ఉంది.