Mallareddy Vs 15 People : మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డికి, మరో 15 మందికి మధ్య హైదరాబాద్‌లోని సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82పై భూవివాదం చోటు చేసుకుంది. తాజాగా శనివారం ఉదయం ఆ స్థలం వద్దకు మల్లారెడ్డి చేరుకున్నారు. తన భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్ వేశారని.. దాన్ని తొలగించాలని అనుచరులను ఆదేశించారు. ఈక్రమంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని మల్లారెడ్డికి సర్దిచెప్పారు. ‘‘ఫెన్సింగ్ వేసిన స్థలం మీది కాదు అని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దాన్ని తిరిగి ఆక్రమించాలని చూడడం చట్టవిరుద్ధం’’ అని మల్లారెడ్డికి పోలీసులు తెలిపారు. ఈక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన మల్లారెడ్డి.. ‘‘నా భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూస్తూ ఎలా ఊరుకున్నారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘వంద మంది గుండాలు మమ్మల్ని చంపేందుకు వచ్చారని.. గంట ముందే మేం ఇన్ఫామ్ చేసిన యాక్షన్స్ తీసుకోలేదు’’ అని పోలీసులపై మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ఈక్రమంలో మల్లారెడ్డి చెప్పిన వెంటనే ఆయన అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చేశారు. ఈ కారణం వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు కుత్బుల్లాపుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను పేట్ బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join
హైదరాబాద్‌లోని సుచిత్ర పరిధిలో ఉన్న ఈ భూమి తమదే అంటూ గతంలో 15 మంది కోర్టులో క్లెయిమ్ చేసుకున్నారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని వారంతా తెలిపారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఆ 15 మంది అంటున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు(Mallareddy Vs 15 People) చెబుతున్నారు.అయితే ఈ స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు పోలీసులు సూచించారు.