Site icon HashtagU Telugu

CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్నాను: సీఎం రేవంత్

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ భాగ్యం తమ ప్రభుత్వానికి దక్కిన గొప్ప అదృష్టమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) అన్నారు. ఈ పుణ్యకార్యంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం నాడు మేడారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆర్థిక సంక్షోభం ఉన్నా నిధుల కొరత ఉండదు

గతంలో ప్రభుత్వాలు నిధుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు అది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. “సీతక్క సంతకం పెట్టి నిధులు తెచ్చే పరిస్థితి వస్తుందని గతంలో చెప్పాను. ఇప్పుడు అదే నిజమైంది. ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ, మేడారం తల్లుల కోసం ఎన్ని కోట్లైనా వెనుకాడం” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిలో సాంప్రదాయాలను పరిరక్షించడంలో ఆదివాసీలను భాగస్వాములను చేస్తామని, గిరిజన వారసులను కలుపుకొని ముందుకు వెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: CM Revanth Reddy: మేడారం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

వేయి సంవత్సరాలు చెక్కుచెదరని నిర్మాణాలు

మేడారం ప్రాంగణాలను రాతి కట్టడాలతో నిర్మించి, వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా చేస్తామని సీఎం అన్నారు. “రామప్ప ఆలయంలాగే మేడారం తల్లుల మందిరం కూడా చెక్కుచెదరని నిర్మాణంగా ఉంటుంది” అని ఆయన ఉద్ఘాటించారు. వంద రోజుల్లోనే ప్రణాళికలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనుల కోసం ఉదయం, రాత్రి తేడా లేకుండా కార్మికులు శ్రమిస్తారని, స్థానికులు వారిని కాపాడుతూ పనులు పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. ఇంచార్జీ మంత్రి పొంగులేటి ప్రతీ వారం పనులను పర్యవేక్షిస్తారని తెలిపారు. “అయ్యప్ప మాల ధారణ అంతటి శ్రద్ధతో పనులు పూర్తి చేయాలి. ఈ సారి జాతరను అత్యద్భుతంగా జరుపుకుందాం” అని అధికారులకు సూచించారు.

తమ ప్రభుత్వం బాధ్యతతో పాటు భావోద్వేగం కలిసిన పాలన అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలో తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా మేడారం సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం తీసుకుని పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు వరుసగా 18 సార్లు అమ్మవార్ల దర్శనానికి వచ్చానని తెలిపారు.

గతంలో అధికారంలో ఉన్న పెద్దలను మేడారం అభివృద్ధి కోసం నిధులు అడిగితే అరకొర నిధులు మాత్రమే ఇచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. తాను చేపట్టిన పాదయాత్రను ‘మా ఇంటి ఆడబిడ్డ నియోజకవర్గం’ అయిన మేడారం నుండే ప్రారంభించానని తెలిపారు. ప్రజలకు ప్రజా పాలన అందించేందుకు ఇక్కడి నుండే సంకల్పంతో అడుగులు వేశానని చెప్పారు.

కేంద్రానికి సీఎం అప్పీల్

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. “కుంభమేళాకు వేల కోట్లు ఇచ్చినట్లుగా మేడారం జాతరకూ నిధులు ఇవ్వాలి. మేడారం జాతరకు జాతీయ హోదా, నిధులు ఇవ్వాలని మేడారం సాక్షిగా అప్పీల్ చేస్తున్నాను” అని ఆయన అన్నారు. ఒకవేళ కేంద్రం నిధులు ఇవ్వకపోతే, తాను ఏమీ అననని, సమ్మక్క సారలమ్మలే అన్నీ చూసుకుంటారని తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా ఉదయం మేఘాలు రావడంతో కొందరు పర్యటన ఆపేయాలని సూచించారని, కానీ తాను సమ్మక్క తల్లి అన్నీ చూసుకుంటుందని ధైర్యంగా ముందుకు సాగానని, వనదేవతల ఆశీర్వాదం, ప్రకృతి సహకారంతో వెనకడుగు వేయలేదని ముఖ్యమంత్రి తెలిపారు.

Exit mobile version