Jogulamba Temple Priest: జోగులాంబ ఆలయ ప్రధాన అర్చకుడు (Jogulamba Temple Priest) ఆనంద్ శర్మపై వేటు పడే ఛాన్స్ ఉంది. అలంపూర్ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే విజయుడు ఇచ్చిన ఫిర్యాదుతో జిల్లా యంత్రాంగం కదిలింది. తన హక్కులకు భంగం కలిగించాడని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఆలంపూర్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. సినిమా థియేటర్‌కు భార్య, పిల్లలతో కలిసి ఎమ్మెల్యే వెళ్లగా.. పూజారి ఆనంద్ శర్మ తన ముఖానికి మాస్క్ ధరించి వీడియోలు, ఫొటోలు తీశారు. అది గమనించిన ఎమ్మెల్యే ఎవరు మీరు? ఎందుకు ఫొటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలోని జోగులాంబ ఆలయం ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మ తన ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తి అని గుర్తించిన ఎమ్మెల్యే అలర్ట్ అయ్యారు.
పూజారి ఆనంద్ శర్మ తనపై కుట్ర చేస్తున్నాడని గుర్తించడంతో పాటు.. తన కుటుంబసభ్యుల సమాచారం సైతం ఎవరికో చెరవేస్తున్నాడని స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ ప్రారంభించారు. కొన్నాళ్ళు ఆనంద్ శర్మ పరారయ్యాడు. తనపై, తన కుటుంభసభ్యులపై జరిగిన ఈ కుట్రపై ఎమ్మెల్యే విజయుడు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. విషయం క్షుణ్ణంగా పరిశీలించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ పూజారి ఆనంద్ శర్మపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత ప్రజాప్రతినిధి ఫ్యామిలితో ఉండగా పూజారి ఆనంద్ శర్మ ఇలా ఎందుకు చేశాడో సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ.. గద్వాల జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
Also Read: Mahakumbh: మహా కుంభమేళా.. 45 రోజుల్లో 65 కోట్ల మందికి పైగా భక్తులు!
స్పీకర్ ఆదేశాలతో విచారణ జరుపుతున్న జిల్లా కలెక్టర్ మరో రెండు, మూడు రోజుల్లో నివేదిక స్పీకర్ కార్యాలయానికి అందజేయనున్నట్లు సమాచారం. కలెక్టర్ నివేదిక ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. తప్పు చేసినట్లు తేలితే ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోమని స్పీకర్ ఆదేశించే అవకాశం ఉంది. గతంలోనూ ఆలయంలో నిధుల దుర్వినియోగం, అమ్మవారి ఆభరణాల మాయం కేసుల్లో ఆనంద్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి.