DK Aruna : గత ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నంబర్ 56లో ఉన్న బీజేపీ ఎంపీ డీకే అరుణ నివాసంలో చోరీ జరిగింది. ఆమె ఇంట్లోకి చొరబడి దాదాపు గంటన్నర పాటు కులాసాగా తిరిగిన ఆ చోరుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ఏరియాలో నిందితుడిని పట్టుకున్నట్లు తెలిసింది. అతడిని రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నిస్తున్నారు. డీకే అరుణ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు ? ఇంట్లో నుంచి ఏమేం తీసుకెళ్లాడు ? అతడిని పంపింది ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారట. ఇవాళ సాయంత్రంకల్లా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ చోరీ ఘటన గురించి పోలీసులు వివరాలను వెల్లడించనున్నారు.
Also Read :Gates Foundation: రేపు బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. జరగబోయే ఒప్పందాలివే
ఇంటి వెనుక వైపు నుంచి..
దొంగ చొరబడిన సమయంలో.. ఇంట్లో డీకే అరుణ(DK Aruna) లేరు. దుండగుడు ఇంట్లోకి చొరబడిన అంశంపై పోలీసులకు వాచ్‌మన్ ఫిర్యాదు చేశాడు. డీకే అరుణ ఇంట్లో సీసీకెమెరాలు ఉండటంతో.. ఫేస్ కనిపించకుండా ముసుగు, గ్లౌజులు ధరించి దుండగుడు వెళ్లాడు. అతడు చాకచక్యంగా కిచెన్, హాలులోని సీసీటీవీ ఫుటేజీలను ఆఫ్ చేశాడు. దాదాపు గంటన్నర పాటు ఇంట్లోనే తిరిగాడు. దీనిపై వెంటనే స్పందించిన డీకే అరుణ.. ఆ దొంగ తమ ఇంట్లో ఎలాంటి చోరీ చేయలేదని వెల్లడించారు. తనకు భద్రతను పెంచాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇంటి వెనుక వైపు నుంచి ఇంట్లోకి దొంగ ప్రవేశించాడన్నారు. దొంగ చొరబడిన సమయంలో ఇంట్లో తన మనవరాలు ఉందని డీకే అరుణ చెప్పారు.ఒకవేళ దొంగను తన మనవరాలు చూసి ఉంటే, ఆ దొంగ ఏం చేసి ఉండేవాడో అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమ ఇంట్లోని వాళ్లంతా భయభ్రాంతులకు గురవుతున్నారని డీకే అరుణ తెలిపారు.