Site icon HashtagU Telugu

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 విజేతగా 24 ఏళ్ల థాయ్‌లాండ్‌ సుందరి.. ఆమె ప్రైజ్ మనీ ఎంతంటే?

Miss World 2025

Miss World 2025

Miss World 2025: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకర్షించిన మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) పోటీలు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ముగిశాయి. 72వ ఎడిషన్‌గా నిర్వహించిన ఈ అందాల పోటీల్లో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ విజేతగా నిలిచారు. 108 దేశాల నుంచి పాల్గొన్న అందగత్తెలను వెనక్కి నెట్టి, ఆమె ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్నారు.

ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమ.. రాత్రి 9:20 గంటల వరకు మూడు గంటల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. సోనీ టీవీ ద్వారా 120 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ వేడుకలో 4,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ లైవ్ ప్రదర్శనలతో అలరించగా.. ప్రముఖ మానవతావాది, నటుడు సోనూ సూద్‌కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేయడం విశేషం. ఆయన జ్యూరీ సభ్యుడిగా కూడా వ్యవహరించారు.

ఓపల్ సుచాత చువాంగ్‌శ్రీ 24 ఏళ్ల వయస్సులో తన అద్భుతమైన అందం, తెలివితేటలు, సామాజిక సేవా నిబద్ధతతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌కు చెందిన ఓపల్, విద్య, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణపై పనిచేస్తున్నారు. “నా దేశాన్ని, సంస్కృతిని ప్రపంచ వేదికపై ప్రదర్శించడం గర్వకారణం. మహిళలకు విద్య, భద్రత కల్పించడమే నా లక్ష్యం” అని విజేతగా ప్రకటించిన తర్వాత ఓపల్ ఉద్వేగంతో చెప్పారు. ఆమెకు రూ. 8.5 కోట్ల నగదు బహుమతి, 1770 వజ్రాలతో అలంకరించిన తెల్ల కిరీటం అందజేశారు. 2024 మిస్ వరల్డ్ విజేత, చెక్ రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవా ఆమెకు కిరీటం ధరింపజేశారు.

పోటీలో మిస్ ఇథియోపియా 1వ రన్నర్-అప్‌గా నిలవగా, మిస్ పోలెండ్ 2వ రన్నర్-అప్, మిస్ మార్టినిక్ 3వ రన్నర్-అప్‌గా ఎంపికయ్యారు. ఇథియోపియాకు చెందిన 22 ఏళ్ల అందగత్తె.. తన దేశంలో మహిళల హక్కులు, విద్యపై అవగాహన పెంచే కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మిస్ పోలెండ్ 25 ఏళ్ల మోడల్, సాంస్కృతిక వైవిధ్యం, పర్యావరణ సమస్యలపై తన ప్రచారంతో దృష్టిని ఆకర్షించారు. మిస్ మార్టినిక్, 23 ఏళ్ల ఔరెల్లే జోవాచిమ్, క్రీడల ఛాలెంజ్‌లో రజత పతకం సాధించి, సామాజిక సేవలో తన నిబద్ధతను చాటారు.

Also Read: Anganwadi Workers: గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ స‌ర్కార్‌.. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు పెంపు!

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు హాజరై హైదరాబాద్‌ను ప్రపంచ దృష్టిలో నిలిపారు. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. “ఈ ఈవెంట్ తెలంగాణ సంస్కృతి, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటింది,” అని ఆయన అన్నారు. పోటీల్లో బ్యూటీ విత్ ఏ పర్పస్, తెలివితేటలు, నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవలపై దృష్టి సారించారు. ఖండాల వారీగా ఎంపికలు, క్వార్టర్ ఫైనల్స్, టాప్ 24 దశలు ఉత్కంఠభరితంగా సాగాయి. థాయ్‌లాండ్ విజేత ఓపల్, మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.