Site icon HashtagU Telugu

TET : ‘టెట్’ నిబంధనతో సీనియర్లకు అన్యాయం – TS UTF

Tet

Tet

సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వ టీచర్లలో ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (TS UTF) కీలక ప్రకటన చేసింది. ‘ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి’ అనే సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని ఆ సంఘం కోరింది. దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న సీనియర్లకు టెట్ నిబంధన అన్యాయం చేస్తుందని పేర్కొంది. 20 నుంచి 25 ఏళ్లుగా విధుల్లో ఉన్న వారిని తిరిగి పరీక్ష రాయమనడం ఏమాత్రం సమంజసం కాదని వాదించింది.

Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

నిబంధనల ప్రకారం.. 2010లో ఎన్‌సీటీఈ (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఉపాధ్యాయ నియామకాలకు టెట్ పాస్ కావడం తప్పనిసరి. కానీ, ఆ నోటిఫికేషన్ కంటే ముందే రిక్రూట్ అయిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని TS UTF డిమాండ్ చేస్తోంది. గతంలో నియామక సమయంలో టెట్ నిబంధన లేనందున, ఇప్పుడు వారికి ఈ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదని సంఘం నాయకులు అభిప్రాయపడ్డారు. ఇది సీనియర్ ఉపాధ్యాయుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని, వారి అనుభవాన్ని తక్కువగా చూస్తుందని వాదిస్తున్నారు.

ఈ సమస్యపై ప్రభుత్వం, సుప్రీంకోర్టు స్పందించి సీనియర్ టీచర్లకు న్యాయం చేయాలని TS UTF కోరింది. ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనాలంటే ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సూచించింది. లేనిపక్షంలో సీనియర్ ఉపాధ్యాయులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారని, అది వారి విధులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం కోసం ఉపాధ్యాయ లోకం ఎదురుచూస్తోంది.