Site icon HashtagU Telugu

BTech Management Seats : ఎంబీబీఎస్‌ తరహాలో బీటెక్ మేనేజ్​మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?

Btech Management Seats Engineering Telangana Tsche

BTech Management Seats : తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇంజినీరింగ్‌ కాలేజీలు ప్రస్తుతం బీ కేటగిరీ(మేనేజ్​మెంట్​ కోటా) సీట్ల కేటాయింపులో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాయి. చాలా వరకు కాలేజీలు మేనేజ్‌మెంట్ కోటా సీట్లకు భారీగా ఫీజులను వసూలు చేస్తున్నాయి. ఈ సీట్ల కేటాయింపు క్రమంలో మెరిట్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఎంతోమంది విద్యార్థులు నష్టపోతున్నారు. దీనిపై ఫిర్యాదులు వస్తుండటంతో.. ఒక పరిష్కార మార్గాన్ని సిద్ధం చేసే దిశగా  తెలంగాణ ఉన్నత విద్యామండలి కసరత్తు మొదలుపెట్టింది.

Also Read :Hyderabad : హైదరాబాద్‌లో మరో సొరంగ మార్గం.. ట్రాఫిక్ కష్టాలకు చెక్

వచ్చే విద్యా సంవత్సరం ​ (2025-26) నుంచి బీటెక్ మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కేటాయింపు, ఫీజులపై ప్రభుత్వ పర్యవేక్షణ  ఉండేలా చూడాలని యోచిస్తోంది. ఎంబీబీఎస్‌ తరహాలోనే బీటెక్ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి.. ప్రభుత్వమే ఫీజును నిర్ణయించి అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టాలనే ప్రతిపాదన కూడా తెలంగాణ ఉన్నత విద్యామండలి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాదనను అమలు చేయడం సాధ్యపడకపోతే.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా ఉన్నాయా అనేది అన్వేషిస్తున్నారు.

Also Read :Home Remedy : మీకు పుల్లని త్రేన్పులు వస్తున్నాయా.? ఈ హోం రెమెడీని ప్రయత్నించండి..!

రాష్ట్రంలో 155 వరకు ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. అన్ని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 70 శాతం బీటెక్​ సీట్లను ప్రభుత్వమే ఏటా మెరిట్, రిజర్వేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తుంటుంది. మిగిలిన 30 శాతం మేనేజ్​మెంట్ కోటా (బీ కేటగిరీ) సీట్లను కాలేజీలే భర్తీ చేసుకుంటున్నాయి. ఈ సీట్లను జేఈఈ మెయిన్‌/ ఎప్‌సెట్‌ ర్యాంకు/ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ఆధారంగా భర్తీ చేయాలని రూల్స్ చెబుతున్నాయి. ఈ సీట్లకు ప్రభుత్వం నిర్దేశించిన కన్వీనర్‌ కోటా రుసుమును తీసుకోవాలి. అయితే మెరిట్‌ను పట్టించుకోకుండా, ఎక్కువ ఫీజును కట్టేందుకు ముందుకొచ్చే వారికే మేనేజ్‌మెంట్ కోటా సీట్లను కేటాయిస్తున్నారు. బాగా గిరాకీ ఉన్న సీఎస్‌ఈ  తదితర బీటెక్ బ్రాంచీల మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఒక్కో దాన్ని రూ.10 లక్షలకుపైనే రేటు కట్టి కేటాయిస్తున్నట్లు చెబుతున్నారు.మేనేజ్​మెంట్ కోటా కింద ఏటా 21 వేలకుపైగా సీట్లు భర్తీ అవుతున్నాయి. ఈ లెక్కన మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కేటాయింపు వల్ల ఇంజినీరింగ్ కాలేజీలకు(BTech Management Seats) ఎంతగా డబ్బు సమకూరుతుందో అంచనా వేయొచ్చు.