CLP Meeting: ఇవాళ కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్‌పీ) సమావేశం జరగనుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అత్యవసరంగా ఢిల్లీకి వెళ్తున్న వేళ జరుగుతున్నందున ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి తొలుత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. అయితేే హైకమాండ్ నుంచి ఆదేశాలు అందగానే నిర్ణయం మార్చుకొని, ఆ భేటీని సీఎల్పీ సమావేశం(CLP Meeting)గా మార్చారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ కూడా పాల్గొంటారు.
ఏ అంశాలపై చర్చిస్తారు ?
- ప్రస్తుతం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలపై చర్చించనున్నారు.
- కులగణన నివేదికపై చర్చిస్తారు.
- ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై డిస్కస్ చేస్తారు.
- ఇటీవలే జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.
- గత ఏడాదికాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి పార్టీపరంగా రూపొందించిన నివేదికలోని అంశాలను సీఎం రేవంత్ వివరించనున్నారు.
- రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అంశాలు, పెండింగ్ బిల్లుల మంజూరు అంశం ప్రస్తావనకు రానుంది.
- ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులతో ఎమ్మెల్యేలకు సమన్వయంపై సీఎం దిశానిర్దేశం చేస్తారు.
- మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, విధేయులకు అవకాశాలు కల్పించే అంశంపైనా చర్చించే ఛాన్స్ ఉంది.
- పీసీసీ కార్యవర్గ కూర్పుపై ప్రాథమిక కసరత్తు చేయనున్నారు.
- తెలంగాణలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ల ఛైర్మన్ పోస్టుల భర్తీపై, వాటిలో పార్టీ నేతలకు అవకాశాలు కల్పించడంపై చర్చించనున్నారు.
- కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపైనా ఈ సమావేశంలో ఫోకస్ చేస్తారు.
- తదుపరిగా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో సన్నద్ధం కావాల్సిన అవసరంపై చర్చించే అవకాశం ఉంది.
సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం.. ?
రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇటీవలే జరిగిన కీలక పరిణామాలపై పార్టీ హైకమాండ్‌కు నివేదికలు వెళ్లినట్లు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేల రహస్య భేటీపైనా పూర్తి సమాచారం హైకమాండ్ పెద్దలకు చేరింది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపైనా పార్టీ పెద్దలు సీరియస్‌గా ఉన్నారు. వీటితో పాటు సీఎల్పీ సమావేశంలో ఇవాళ చర్చించే అంశాలపై డిస్కస్ చేసేందుకే సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీ, మహేశ్‌కుమార్‌గౌడ్‌లను ఢిల్లీకి రమ్మని హైకమాండ్ పిలుపునిచ్చింది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ పదవుల భర్తీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.