ప్రతిష్టాత్మక డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని (Telangana Secretariat) సీఎం కేసీఆర్ (CM KCR) ప్రారంభించారు. తూర్పు గేటు నుంచి సచివాలయానికి సీఎం చేరుకున్నారు. యాగశాలలో పూజ కార్యక్రమం అనంతరం ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం అందుకున్నారు. ఆయన వెంట సీఎస్ శాంతికుమారి, ఎంపీ సంతోష్ కుమార్, సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా సెక్రటేరియట్ ప్రాంగణం మొత్తం భద్రతా వలయంలోకి వెళ్లింది. పోడు పట్టాల మార్గదర్శాకాల ఫైల్ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు.
సచివాలయం ఆరో అంతస్తులో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఏర్పాటైంది. CM ఛాంబర్, విశిష్ట అతిథులతో సమావేశమయ్యే మందిరం, డైనింగ్ హాల్స్ వంటి నిర్మాణాల్లో ఉన్న తెలుపు, క్రీమ్ మధ్యలో సన్నటి బంగారు రంగు పట్టీలతో ఉన్న కలర్ స్కీం, ఫ్రాన్స్‌లోని వెర్సెల్లెస్ రాజభవనంలోని గదుల్ని తలపిస్తున్నాయి. ప్రజాదర్బారు నిర్వహించేందుకు కనీసం 250మంది కూర్చునేలా ఒక హాలును ఏర్పాటు చేశారు.
Also Read: Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం అందర్నీ కట్టిపడేస్తోంది. సరికొత్త కాంతులతో ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకకు నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తోంది. తెలంగాణ సచివాలయాన్ని మొత్తం 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 10,51,676 చదరపు అడుగులు ఉంటుంది. 265 అడుగుల ఎత్తున భవనాన్ని నిర్మించారు.. ఇందులో 8 ఎకరాలను పూర్తిగా పచ్చదనం కోసమే కేటాయించారు. ప్రస్తుతం ఉన్న 16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల కార్యాలయాలు ఉంటాయి. 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులు, విభాగాల కార్యాలయాలను ఏర్పాటు చేశారు.