Telangana Global Summit : పెట్టుబడులకు కేరాఫ్‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ – సీఎం రేవంత్

Telangana Global Summit : అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపడానికి ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక 'తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్'పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు

Published By: HashtagU Telugu Desk
Telangana Global Summit

Telangana Global Summit

అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్‌ను కేంద్రంగా నిలపడానికి ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా దృష్టి సారించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ఈ సమ్మిట్‌కు సంబంధించిన బ్రాండింగ్‌పై సీఎం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ ప్రచార చిత్రాలు, వీడియోలను పరిశీలించిన సీఎం పలు మార్పులు చేర్పులు సూచించారు. హైదరాబాద్‌ను ‘ఫ్యూచర్ సిటీ’గా ప్రపంచానికి చాటిచెప్పే క్రమంలో, నగరంలో చేపడుతున్న ప్రతి అంశాన్ని ప్రచారంలో ప్రముఖంగా ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. పెట్టుబడిదారులకు కల్పించే సదుపాయాలు, ముఖ్యంగా ఇన్నర్, ఔటర్, రాబోయే రీజినల్ రింగ్ రోడ్లు, గ్రీన్‌ఫీల్డ్ హైవే, పోర్టు కనెక్టివిటీ, రైలు మార్గం, డ్రై పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అనుకూలతను సమగ్రంగా వివరించాలని ఆదేశించారు.

Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ యొక్క ప్రత్యేకతలను బలంగా ప్రొజెక్ట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కేవలం భౌతిక మౌలిక వసతులే కాకుండా, రాష్ట్ర కళలు, సంస్కృతి, భాష, మరియు వాతావరణ అనుకూలతను వివరించాలని తెలిపారు. తెలంగాణ బ్రాండింగ్‌కు సంబంధించి, రాష్ట్రానికే పరిమితమైన వైవిధ్యమైన అంశాలకు ప్రచారంలో చోటు కల్పించాలని ఆదేశించారు. ఇందులో రామప్ప ఆలయ నంది, సమ్మక్క-సారలమ్మ జాతర, నల్లమల పులులు, మహబూబ్‌నగర్ జిల్లా ఎద్దులు వంటి సాంస్కృతిక అంశాలు ఉన్నాయి. వీటితో పాటు, జాతీయ రాజకీయాలను శాసించిన పీవీ నరసింహారావు వంటి ప్రముఖులు, అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగు ప్రముఖులు, క్రీడాకారులను కూడా బ్రాండింగ్‌లో ఉపయోగించుకోవాలని సూచించారు.

పాలనలో స్థిరత్వాన్ని నొక్కి చెప్పడానికి, 1999 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా విధానపరమైన నిర్ణయాల్లో ఎలాంటి మార్పు లేదనే అంశాన్ని పెట్టుబడిదారులకు బలంగా వివరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని బలంగా నొక్కి చెప్పాలని సూచించారు. ఈ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుండగా, ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. భద్రత విషయంలో రాజీ పడకుండా, పాస్‌లు లేనివారికి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, హాజరయ్యే మీడియాకు, బందోబస్తు సిబ్బందికి కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తరహాలో భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ కూడా తెలంగాణ బ్రాండ్‌గా నిలుస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు.

  Last Updated: 26 Nov 2025, 11:33 AM IST