CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిజర్వేషన్ బిల్లులు ఇప్పటికీ ఆమోదం పొందకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. “విద్యా, ఉపాధి రంగాలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు, అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై బిల్లును కేంద్రం ఆలస్యం చేస్తోంది,” అని విమర్శించారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవని, వెనుకబాటు తనమే ప్రధాన ప్రమాణమని సీఎం స్పష్టం చేశారు. “మతాలు ప్రాతిపదిక కావు. సామాజిక వెనుకబాటు, ఆర్థిక వెనుకబాటు ప్రధాన ప్రమాణం,” అని పేర్కొన్నారు. రేపు ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీతో సమావేశం జరిగి, సర్వే ఫలితాలపై చర్చిస్తామని తెలిపారు. “కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వ్యూహాత్మకంగా పనిచేస్తాం. మా సర్వే దేశానికి ఒక రోల్ మోడల్,” అని రేవంత్‌రెడ్డి అన్నారు.
“జనగణనలో కులగణన అవసరమని మేము నిరూపించాం. తెలంగాణలో చేసిన సర్వే దేశానికి ఉదాహరణ. ఈసందర్భంగా పార్లమెంటులో మా పార్టీ, మిత్రపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి,” అని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలను కలుసుకొని ఈ అంశంపై మరింత మద్దతు తీసుకువస్తామని తెలిపారు.
బీజేపీపై ఆయన ఘాటుగా స్పందించారు. “గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయనే విషయం బీజేపీ ఎందుకు చెప్పదని? ఒక ఇంటర్వ్యూలో అమిత్ షా కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. అయితే ఆయన్ను బీజేపీ సస్పెండ్ చేస్తుందా? కేంద్రం తక్షణమే తెలంగాణ బిల్లును ఆమోదించాలి,” అని రేవంత్ వ్యాఖ్యానించారు.
“సర్వే విషయాలను పారదర్శకంగా శాసనసభలో చర్చించాం. వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయలేదు. మొత్తం 3.9 శాతం ప్రజలు తమ కులాన్ని ప్రకటించలేదని మా రిపోర్ట్ చెబుతోంది. నిపుణుల కమిటీ సిఫారసులను క్యాబినెట్ చర్చించి, శాసనసభలోకి తీసుకువెళ్తాం,” అని తెలిపారు.
“బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. మేము సేకరించిన డేటా, విశ్లేషణల ఆధారంగా కేంద్రం ముందు బలమైన వాదనతో నిలబడతాం. అవసరమైతే దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతాం,” అని రేవంత్‌రెడ్డి హితవు పలికారు.
China : బుద్ధి మార్చుకోని చైనా.. భారత్ పై బంగ్లాదేశ్ లో కుతంత్రాలు..