Harish Rao : తెలంగాణలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై తీవ్ర విమర్శలు వెలువడుతున్నాయి. అర్హులైన అనేక మంది పేర్లు జాబితాలో లేవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆయన తన లేఖలో, రేషన్ కార్డుల అంశం పేద ప్రజలకు జరిగిన అన్యాయమని పేర్కొంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా లక్షలాది పేదల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.
హరీష్ రావు, ఇటీవల చేపట్టిన కులగణన సర్వే సందర్భంలో ప్రభుత్వ విధానం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. సర్వేలో చెప్పిన విధానాలు ఒకటైతే, రేషన్ కార్డుల జారీ విధానం మరొకటి అని విమర్శించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sri Reddy: వైసీపీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నా.. శ్రీరెడ్డి సంచలనం
ఈ విమర్శల నేపథ్యంలో, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, జాబితాలో పేరు లేనివారు ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సర్వే ప్రకారం అర్హులైన ప్రతీ ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రకటనపై హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని, ఇది బీఆర్ఎస్ విజయమని అన్నారు. అయితే, ప్రభుత్వంపై కీలక సూచనలు చేస్తూ పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆదాయ పరిమితిని సవరించాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.60,000, పట్టణ ప్రాంతాల్లో రూ.75,000గా ఉండేదని, తమ ప్రభుత్వ హయాంలో ఈ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలుగా, పట్టణాల్లో రూ.2.50 లక్షలుగా పెంచామని గుర్తుచేశారు.
మాగాణి భూమికి సంబంధించిన పరిమితిని కూడా గుర్తుచేశారు. గతంలో మాగాణి భూమి పరిమితి రెండున్నర ఎకరాలు కాగా, తమ ప్రభుత్వం దీన్ని మూడున్నర ఎకరాలకు పెంచిందని, మెట్ట భూమికి సంబంధించిన పరిమితిని ఐదు ఎకరాల నుంచి ఏడున్నర ఎకరాలుగా పెంచారని తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా లక్షలాది నిరుపేదలు రేషన్ కార్డులకు అర్హత సాధించారని చెప్పారు.
హరీష్ రావు, పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆదాయ పరిమితి పెంపుతో పాటు నిబంధనల్లో మార్పు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ఇతర అల్పాదాయ వర్గాలకు రేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రేషన్ కార్డుల మంజూరులో అవకతవకలతో పాటు ప్రజల న్యాయమైన హక్కులను కాపాడే చర్యలతో ముందుకు సాగాలని హరీష్ రావు కోరారు. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
Fact Check : చెక్కులను నింపడానికి బ్లాక్ ఇంక్ వినియోగంపై బ్యాన్.. నిజమేనా ?