81516 Crore Debt : తెలంగాణ విద్యుత్ శాఖ అప్పులు ఎన్నో తెలుసా ? రూ.81,516 కోట్లు. రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలతో పాటు విద్యుత్ సరఫరా సంస్థ ‘ట్రాన్స్‌కో’, విద్యుత్ ఉత్పత్తి సంస్థ ‘జెన్‌కో’తో కలిపి మొత్తం 4 సంస్థలకున్న అప్పులు తెలంగాణ ఏర్పడే సమయానికి (2014-15 నాటికి) రూ.22,423 కోట్లు. పదేళ్ల తర్వాత ఇప్పుడవి రూ.81,516 కోట్లకు(81516 Crore Debt) చేరాయి. వీటిలో విద్యుత్ కొనుగోలు చేసినందుకు, బిల్లుల చెల్లింపుల కోసం డిస్కంలు తీసుకున్న స్వల్పకాలిక రుణాలే రూ.30,406 కోట్ల దాకా ఉన్నాయి. ఈ స్వల్పకాలిక రుణాల కారణంగా ప్రతినెలా వడ్డీల రూపంలో రూ.1000 కోట్ల అదనపు భారం రాష్ట్ర సర్కారుపై పడుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి జరిపిన అంతర్గత సమీక్షలో రాష్ట్రంలోని 4 విద్యుత్ సంస్థల అప్పులు, నష్టాలపై ఆ శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈవివరాలను వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
అన్ని వర్గాల వారికి 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిస్కంలను ఆదేశించారు. ఆరు గ్యారెంటీ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా సరఫరా చేయాల్సి ఉందని, దీనికి ఎంత వ్యయమవుతుందో అంచనాలు తయారు చేయాలని సూచించారు. అందరికీ 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తే ఏడాదికి దాదాపు రూ.4000 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.