Banakacherla : ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అనుమతుల జారీ ప్రక్రియను ప్రారంభించరాదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను అధికారికంగా కోరింది. ఈ ప్రాజెక్టు పట్ల ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (PFR)పై కేంద్రం ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన నేపథ్యంలో, తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి ఒక విస్తృత లేఖ రాశారు.
ఆ లేఖలో రాహుల్ బొజ్జా, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014, గోదావరి నీటి ట్రైబ్యునల్ తీర్పు, పోలవరం ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా తెలంగాణ సమ్మతి తప్పనిసరి అని, పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 90(3)లోని నిబంధనలు బనకచర్ల ప్రాజెక్టుకు వర్తించవని తెలిపారు. గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పులో మిగులు జలాల హక్కులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కే చెందినవని, కాబట్టి వేరు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అంగీకారం లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.
గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కి, అక్కడి నుంచి పెన్నా బేసిన్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించాలని ఏపీ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కింద 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, 3 లక్షల హెక్టార్ల కొత్త ఆయకట్టు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇవి గోదావరి బేసిన్ పరిధిలోకి రాకుండా పూర్తిగా కృష్ణా–పెన్నా బేసిన్లలోకి వస్తున్నందున ఈ ప్రాజెక్టును తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలంగాణ లేఖలో స్పష్టం చేసింది.
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్ నీటిని వెలుపల ప్రాంతాలకు తరలించడం వల్ల కృష్ణా బేసిన్‌లో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, ఇప్పుడు గోదావరి నీటిని కూడా కృష్ణా మీదుగా పెన్నాకు తరలించడం కృష్ణా ట్రైబ్యునల్–1 తీర్పుకు వ్యతిరేకమని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదన ప్రకారం రోజుకు 2 TMCల చొప్పున మొత్తం 200 TMCల గోదావరి వరద జలాలను తరలించనున్నారు. ఆ పనులు రోజుకు 3 TMCల తరలింపుకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్లు 84(3)(2), 85(8సీ/8డీ) ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టుకైనా ముందుగా సంబంధిత నదీ యాజమాన్య బోర్డు, ఆ తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతులు పొందడం తప్పనిసరి. అయితే బనకచర్ల ప్రాజెక్టు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందుకు సాగుతోందని తెలంగాణ లేఖలో పేర్కొంది.
WAR 2 Trailer : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్
బనకచర్ల ప్రాజెక్టు కారణంగా పోలవరం ప్రాజెక్టు గేట్ల నిర్వహణలో మార్పులు జరిగే అవకాశం ఉందని, దీని ప్రభావంతో బ్యాక్‌వాటర్ సమస్యలు పెరిగి భద్రాచలం పట్టణం, ఆలయాలు, పరిసర గ్రామాలు , మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ హెచ్చరించింది.
బనకచర్లలో భాగంగా పోలవరం ఫోర్‌షోర్ నుంచి నీటి తరలింపు జరిగితే, ఆ పనులు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) పరిధిలోకి వస్తాయి. PPA టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (TAC) , CWC అనుమతుల ఆధారంగా మాత్రమే పనులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అనుమతులు లేకుండా పోలవరం విస్తరణ పేరుతో బనకచర్ల పనులను చేపట్టడం సరికాదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 449.78 TMCల నీటి తరలింపుకు ఇప్పటికే DPR సిద్ధం కాగా, ఇప్పుడు అదే ప్రాజెక్టు ద్వారా మరో 200 TMCల తరలింపుకు ఏపీ బనకచర్ల ప్రతిపాదన తెచ్చింది. దీని ఫలితంగా పోలవరం ప్రాజెక్టు షెడ్యూల్ మార్పులకు గురయ్యే అవకాశం ఉందని తెలంగాణ తెలిపింది. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా మధ్య కుదిరిన ఒప్పందాలకు విరుద్ధమని తెలంగాణ లేఖలో పేర్కొంది.
కృష్ణా జలాల్లో తెలంగాణకి రావాల్సిన 45 TMCల వాటా ఇప్పటికీ ఏపీ నుంచి రాలేదని, అలాగే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న గోదావరి జలాల్లోనూ వాటా ఇవ్వడం లేదని తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు వచ్చే వరదల తీవ్రత ఆధారంగా నీటి నిల్వలను ఏ స్థాయిలో ఉంచాలో గోదావరి ట్రైబ్యునల్ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నదని, ఈ ఆపరేషన్ ప్రోటోకాల్ను తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలతో చర్చించకుండా మార్చరాదని తెలంగాణ లేఖలో పేర్కొంది.
పోలవరం ప్రాజెక్టుకు జారీ చేసిన పర్యావరణ అనుమతులను విస్తరించే పనులు చేపట్టరాదని 2011లో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు ఇచ్చినట్లు తెలంగాణ గుర్తుచేసింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉందని కూడా తెలంగాణ తన లేఖలో ప్రస్తావించింది.
Caste Census Survey : కులగణన విషయంలో సీఎం రేవంత్ ఒక స్పిరిట్ తో పనిచేశారు – రాహుల్ గాంధీ