By: డా. ప్రసాదమూర్తి
Telangana Liberation Day Celebrations : సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలో అధికారపక్షంతో సహా అన్ని పక్షాలూ వేరువేరు సభలలో వేరు వేరు రకాలుగా ఉత్సవాలు జరిపారు. నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ సెప్టెంబర్ 17, 1948న భారత ప్రభుత్వంలో విలీనమైంది. ఇది ఏదో నామమాత్రంగా కేవలం ఒక తేదీని గుర్తుచేసే నేపథ్యం కాదు. తెలంగాణలో నైజాం పాలనలో, రజాకార్ల భూస్వాముల దొరల నిరంకుశ పాదాల కింద నలిగిపోయిన సామాన్య ప్రజలు, అణగారిన రైతులు నిజాంకి వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపారు. వేలమంది రక్తతర్పణ సాగించిన ఆ పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహించారు.
అంతకుముందు ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్ వంటి సంస్థల ప్రేరణ కూడా ఈ ఉద్యమానికి ఉంది. శతాబ్దాలుగా బానిస బంధాలలో చీకటి బతుకులు కొనసాగించిన అసహాయ రైతులు, సామాన్య ప్రజలు అసామాన్య పోరాటం చేసిన ఫలితంగానే నిజాం పాలన నుండి తెలంగాణ ప్రాంతం విముక్తి చెంది, భారత ప్రభుత్వంలో భాగమైంది. ఈ సందర్భంగా వేలమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిగా చెల్లాచెదురయ్యారు. వేలాదిగా కటకటాల పాలయ్యారు. దశాబ్దాల తరబడి కేసులలో ఇరుక్కుని జీవితమంతా కోర్టుల చుట్టూ తిరిగారు. ఎన్నో బలిదానాలు.. ఎన్నో త్యాగాలు.. ఎన్నో అల్లకల్లోలాలు విధ్వంసాల నేపథ్యం తెలంగాణ (Telangana) ఆవిర్భావానికి ఉంది. దీన్ని ఎవరు ఎలా జరిపినా తమ తమ పార్టీల ఎజెండాల అనుకూలంగా ఈ చారిత్రక నేపథ్యాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించడం చారిత్రక నేరమే అవుతుంది.
17వ తేదీన హైదరాబాదులో నాలుగు ప్రధాన పక్షాలు ఈ చారిత్రక నేపథ్యాన్ని ఎలా తలుచుకున్నాయో ఒకసారి చూద్దాం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా బిజెపి ఆధ్వర్యంలో జరిగిన సభలో మాట్లాడుతూ అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా జరపడానికి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నవారు భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ప్రధాని మోడీ చేసిన సంకల్పం అద్భుతమైనదని ఈ సందర్భంగా అమిత్ షా ప్రధానిపై ప్రశంసలు వర్షం కురిపించారు.
ఇదే సందర్భంగా తెలంగాణలో (Telangana) ఒకప్పుడు రజాకార్లకు నియంతత్వ పాదాల కింద ప్రజలు ఎలా నలిగిపోయారో గుర్తు చేసుకున్నారు గాని, ఆనాడు ప్రజలు తుపాకులు పట్టి ఎవరి నాయకత్వంలో తిరగబడ్డారో.. ఆ కమ్యూనిస్టు నాయకత్వాన్ని పేరుకైనా ఆయన ప్రస్తావించలేదు. ఈ సందర్భంగా ఆయన ఆర్య సమాజ్ హిందూ మహాసభ వంటి సంస్థల పేర్లు ప్రస్తావించారు. సర్దార్ పటేల్, కేఎం మున్షి వంటి వారు లేకపోతే తెలంగాణ విముక్తి చెందేది కాదని కూడాఅన్నారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు బూర్గుల రామకృష్ణారావు వంటి ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావించారు. అంతే తప్ప ఆనాటి సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నాయకుల ప్రస్తావన ఆయన తీసుకురాలేదు.
ఇదే సెప్టెంబర్ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ వారు జరిపిన విజయభేరి సభలో పేరుకైనా తెలంగాణ విమోచన (Telangana Liberation) నేపథ్యాన్ని ప్రస్తావించలేదు. తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వస్తే తాము 6 ముఖ్యమైన పథకాలను అమలు చేస్తామని ఇవి కేవలం వాగ్దానం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకుని తెలంగాణ కల ఎలా అయితే సాకారం చేశామో, అలాగే ఈ ఆరు ముఖ్యమైన పథకాలను కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహ జ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, విద్యా భరోసా యువ వికాసం పథకం, చేయూత పథకం ఇలా ఆరు పథకాలలో ఏ పథకం కింద ఏమేమి పనులు చేస్తారో వాటిని వివరించడానికి కాంగ్రెస్ వారు ఈ సందర్భంగా పెట్టిన బహిరంగ సభను వేదిక చేసుకున్నారు. మీరు కూడా ఎక్కడా తెలంగాణ ప్రాంతం సెప్టెంబర్ 17 తేదీతో ఎలాంటి చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉందో మచ్చుకైనా ముచ్చటించలేదు.
మరోపక్క పాలక బీఆర్ఎస్ పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన బహిరంగ సభ పెట్టింది. దీనికి జాతీయ సమగ్రతా దినోత్సవం అని పేరు కూడా పెట్టింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా తమ పాలనలో తెలంగాణ ప్రజలకు చేకూరిన లాభాలు వల్లెవేసి, తాము రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నామో వాటినే ప్రస్తావించారు. కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడానికి 1,226 గ్రామాలకు తాగునీటిని అందించడానికి తాము చేపట్టిన ప్రాజెక్టుల గురించి ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాదు, ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం దాన్ని అనుసరిస్తుంది’ అని గొప్ప నినాదాన్ని కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఇచ్చారు. ఆయన కూడా ఎక్కడా సెప్టెంబర్ 17వ తేదీతో తెలంగాణకు ఏవిధంగా చారిత్రక ప్రాధాన్యత ఉన్నదో.. ఏ చీకటి నుంచి ఏ వెలుగులోకి రావడానికి ఎంత రక్త తర్పణ జరిగిందో.. నైజాం పాలన నాటి ఆ నియంత్రత్వపు రోజుల్ని, ఆనాడు తిరగబడిన ప్రజల ధైర్య సాహసాలను ఆయన కూడా ఒక్క మాట మాత్రం గానైనా ప్రస్తావించలేదు.
ఇలా తెలంగాణ కోటి రత్నాల వీణగా ఆవిర్భవించి తన ఉనికిని చాటుకొని అస్తిత్వ పోరాటంలో అనన్య పటిమను ప్రదర్శించిన చరిత్రను అంతా నేతలు పక్కన పెట్టి, సెప్టెంబర్ 17వ తేదీన తమ తమ పార్టీల సొంత ఎజెండాల సంబరంగా మార్చి ఉత్సవాలు జరుపుకున్నారు. పోతే తెలంగాణ ప్రాంత విముక్తికి, ఇక్కడ జరిగిన సాయుధ రైతాంగ పోరాటానికి ప్రాణాలర్పించి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీల వారసత్వంగా సిపిఐ, సిపిఎం మాత్రం ఒక వారం రోజులపాటు సభలు నిర్వహించి సెప్టెంబర్ 17వ తేదీన ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఇలా మొత్తానికి సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణలో ఉత్సవాలయితే జరిగాయి గాని, అవి పార్టీల ఉత్సవాలు గానే మిగిలాయి. సెప్టెంబర్ 17వ తేదీకి ఉన్న చారిత్రక నేపథ్యం మరుగున పడిపోయింది.
Also Read: All Party Meet: టీడీపీ అఖిలపక్ష సమావేశం.. జగన్ పై 38 క్రిమినల్ కేసులు