Telangana Rains : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం మొత్తం తడిసి ముద్దైపోయింది. పలు పట్టణాలు, గ్రామాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరిక ప్రకారం, మరో 72 గంటల పాటు రాష్ట్రంలో విస్తారంగా, కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం అలర్ట్ మోడ్‌లోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అన్ని విభాగాలకూ ముందస్తు సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా పాఠశాల విద్యాశాఖ, వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాఠశాలల పని వేళల్లో మార్పులు చేసింది. GHMC పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో హాఫ్ డే మాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలు ఉదయం పూట మాత్రమే నిర్వహించబడతాయి.
India-China: అమెరికాకు చైనాతో చెక్ పెట్టనున్న భారత్!
అదే సమయంలో హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రెండు రోజులపాటు పూర్తి సెలవులు ప్రకటించింది. పాఠశాలలతో పాటు, ఇతర రంగాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐటి సంస్థలకు, ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశాన్ని ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే వచ్చే మూడు-నాలుగు రోజులపాటు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచనలిచ్చింది.
ఇరిగేషన్ శాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. అలాగే, వచ్చే నాలుగు రోజులపాటు ఇరిగేషన్ శాఖలో అధికారుల సెలవులను రద్దు చేశారు.
పరిస్థితి ఎంత తీవ్రమైనా తానే స్వయంగా అందుబాటులో ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. మొత్తం మీద, తెలంగాణలో వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు కలిగిస్తున్నా, ముందస్తు చర్యలతో ప్రభుత్వం పరిస్థితిని నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేస్తోంది.
Amaravati : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన