Site icon HashtagU Telugu

Telangana Elections : దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారిన తెలంగాణ

Telangana Has Become A Key In The Country's Politics

Telangana Has Become A Key In The Country's Politics

By: డా. ప్రసాదమూర్తి

Telangana Elections : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇక దగ్గర పడ్డాయి. నవంబర్ 30 వ తేదీతో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీ‌స్ గఢ్.. ఈ మూడు రాష్ట్రాలలో 2018లో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే కొన్ని రాజకీయ పరిణామాలు, పరిస్థితులు, నేతల తిరుగుబాట్లు కారణంగా మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. అయినా ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ గానే మనం భావించాలి. మిజోరాంలో స్థానిక పార్టీల ప్రాబల్యం ఉంటుంది. ఇక మిగిలింది తెలంగాణ. ఈ తెలంగాణ (Telangana)ను కైవసం చేసుకుంటే రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాలకు సారథ్యం వహించి చక్రం తిప్పే అవకాశం తమకు లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదే సమయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన రాజస్థాన్ మధ్యప్రదేశ్ చత్తీస్గఢ్ లలో ఆ పార్టీని దెబ్బతీస్తే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం ఎదురవుతుందని, ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ కు అంత విలువ ఇచ్చే అవకాశం ఉండదని బిజెపి, కాంగ్రెస్ ఓటమి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లోనే కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ (Telangana)లో కూడా తన విజయావకాశాలను మెరుగుపరచుకుంటూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకోవడం బిజెపికి రాజకీయ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనది.

తెలంగాణ (Telangana) ఏ విధంగా కీలకం?

ఇప్పటికే కాంగ్రెస్ కర్ణాటక విజయంతో, రాహుల్ గాంధీ ఇటీవల సాగించిన భారత్ జోడో యాత్ర సఫలీకృతం కావడంతో, తమ పార్టీ పట్ల పెరిగిన ప్రజాదరణను ఎన్నికల విజయంగా మలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలనూ ముమ్మరం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణలో పాగా వేసి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పటి వైభవాన్ని పునరుద్ధరించుకుంటే అది దేశ రాజకీయాల మీద అత్యంత గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే బీజేపీ కర్ణాటకలో ఓటమి తర్వాత దక్షిణాది రాష్ట్రాలలో చాలా వెనుకబడిపోయింది. రకరకాల సర్వేల ప్రకారం ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా రానున్న సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఓట్ల శాతం, సీట్ల శాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలలో కాంగ్రెస్ బలం పెంచుకుంటే ఆ రాష్ట్రాల నుంచి బిజెపికి కావలసిన మద్దతు అందే అవకాశం ఉండదు. అంటే కాంగ్రెస్ దక్షిణాదిన సాధించే విజయం ఏదైనా అది జాతీయస్థాయిలో బిజెపి దెబ్బ తినడానికి కారణం కాగలదని అంచనా ఒకటి ఉంది.

దీని రీత్యా బిజెపికి తెలంగాణ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ మూడోసారి విజయం సాధించినా పరవాలేదు కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలుపొందడం బిజెపికి అత్యంత హానికరం. అందుకే తెలంగాణలో బిజెపి ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే ఒకప్పుడు తెలంగాణలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించిన బిజెపి నాయకులు ఇప్పుడు తమకంత సీన్ లేదని అర్థం చేసుకున్నారు. అందుకే వారి నోట తెలంగాణలో హంగ్ అసెంబ్లీ అనే మాట పదేపదే వినిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి ఎంత అవసరమో, బీఆర్ఎస్ గెలుపు ఎంత అవసరమో, బిజెపికి తమ ఓట్ల శాతాన్ని పెంచుకోవడం కూడా అంతే అవసరం.

Also Read:  Israel Bombs Ambulances : అంబులెన్సులపైకి ఇజ్రాయెల్ బాంబులు.. 15 మంది మృతి, 60 మందికి గాయాలు

తెలంగాణలో తాము విజయం సాధించలేకపోయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా కాంగ్రెస్ ని కట్టడి చేసి తమ ఓటు శాతాన్ని పెంచుకోవడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం తగ్గలేదని బిజెపి నిరూపించుకోవడానికి సకల ప్రయత్నాలూ సాగిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో నువ్వా నేనా అంటూ అధికార బీఆరె‌స్ తో ఢీకొని ముందుకు కదులుతోంది. రాహుల్ గాంధీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కంటే ఎక్కువ సమయాన్ని తెలంగాణ కోసం కేటాయిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో తమ గెలుపు తధ్యమని కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. ఇటీవల చెలరేగిన మేడిగడ్డ వివాదం తెలిసిందే. ఆ బ్యారేజ్ ను స్వయంగా రాహుల్ పరిశీలించి వచ్చారు. ప్రియాంక గాంధీ కూడా తరచుగా తెలంగాణ వస్తున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం లో ముఖ్య నాయకులు నిత్యం తెలంగాణను సందర్శిస్తున్నారు. ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను అత్యంత జాగరూకతతో పరిశీలిస్తున్నారు. తనదైన రాజకీయ పార్టీలో గత నడుపుతున్నారు. ఈ మొత్తం వాతావరణాన్ని చూస్తే అటు బిజెపి గాని ఇటు కాంగ్రెస్ గాని తెలంగాణ దేశ రాజకీయాలను మలుపు తిప్పే కేంద్ర బిందువుగా మారిందని భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్షాలు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ప్రతిపక్షాల మధ్య అగ్రగామిగా తమ పార్టీ ముందు నిలవాలన్నా, ప్రధాని అభ్యర్థిగా తమ పార్టీ నాయకుడు అందరి ఆమోదం పొందాలన్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం అత్యంత ఆవశ్యకం.

కాంగ్రెస్ కి అలాంటి అవకాశం దక్కకుండా చూడాలంటే తెలంగాణలో తమ ప్రాబల్యాన్ని కాపాడుకోవడం బిజెపికి అంతే ఆవశ్యకం. ఇక మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న కేసీఆర్ కు కూడా ఈసారి విజయం అంతే ఆవశ్యకం. దేశవ్యాప్త ప్రతిపక్ష కూటమిలో కాంగ్రెస్ స్థానాన్ని నిర్ణయించేది కూడా తెలంగాణ ఎన్నికలే. అందుకే దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది.

Also Read:  Telangana : తెలంగాణ ఎన్నిక‌ల వేళ జోరుగా సాగుతున్న మ‌ద్యం విక్ర‌యాలు.. ఒక్క నెల‌లోనే..?

Exit mobile version