Site icon HashtagU Telugu

Diet Charges Hike: విద్యార్థులకు శుభవార్త…డైట్ చార్జీల ఫైల్ పై సంతకం చేసిన సీఎం కేసీఆర్

Diet Charge

New Web Story Copy (7)

Diet Charges Hike: రాష్ట్రంలోని అన్ని రకాల గురుకులాల సహా, పలు శాఖలకు అనుబంధంగా నడుస్తున్న హాస్టళ్ళలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మరోసారి మానవీయకోణంలో నిర్ణయం తీసుకున్నారు. గురుకుల హాస్టళ్ళలో చదువుకునే విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజన వసతులను అందించేందుకు ప్రస్తుతం అందిస్తున్న డైట్ చార్జీల పెంపుదలకు సంబంధించిన ఫైలు మీద సంతకం చేశారు. పెరిగిన డైట్ చార్జీలు జూలై నెల నుండి అమలులోకి రానున్నాయి.

పెరిగిన డైట్ చార్జీల వివరాలు:
▪️3వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న 950 డైట్ చార్జీలు 1,200 కు పెరిగాయి.

▪️8వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు 1,100 నుంచి 1,400 లకు పెరిగాయి.

▪️11వ తరగతి నుండి పీజీ దాకా చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు అందిస్తున్న డైట్ చార్జీలు 1,500 నుంచి 1,875 లకు పెరిగాయి.

డైట్ చార్జీల పెరుగుదల కోసం సీఎం కేసీఆర్ మంత్రుల సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. కసరత్తు అనంతరం సీఎం కి సబ్ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచింది. పెరిగిన డైట్ చార్జీల ద్వారా ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, బిసి వెల్ఫేర్ గురుకులాలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలు తదితర మొత్తం గురుకులాల్లోని దాదాపు 7 లక్షల 50 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనున్నదని సీఎం తెలిపారు. ప్రస్తుతం అందిస్తున్న చార్జీలకు అదనంగా 26 శాతం చార్జీలు పెరిగాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపు మరో 237.24 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం పడనున్నది.

రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడే అదనపు భారాన్ని లెక్కచేయకుండా రాష్ట్రంలో విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్ళలో చదువుకుంటున్న విద్యార్థులకోసం సన్నబియ్యంతో అన్నం పెడుతూ వారికి నాణ్యమైన విద్యతో పాటు చక్కటి భోజనాన్ని కూడా ఇప్పటికే అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు మరింత గొప్పగా భోజన వసతులను కల్పించేందుకు అనుగుణంగా చార్జీలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం స్పష్టం చేశారు.

డైట్ చార్జీల పెంపుదల ఫైలుపై సంతకం చేసిన సందర్భంగా గిరిజన సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ కి కృతజ్జతలు తెలిపారు.

Also Read: Nara Rohit: నారా రోహిత్ కొత్త మూవీకి డైరెక్టర్ గా టీవీ5 మూర్తి..!