Gruha Lakshmi : తెలంగాణలో గృహలక్ష్మి పథకం రద్దు.. ఎందుకు ?

Gruha Lakshmi : తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది.

Published By: HashtagU Telugu Desk
Cm Revanth Reddy

Cm Revanth Reddy

Gruha Lakshmi : తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది. గతంలో కేసీఆర్‌ సర్కారు తీసుకొచ్చిన గృహలక్ష్మి సొంతింటి పథకాన్ని నిలిపివేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గృహలక్ష్మి పథకం కింద బెనిఫీషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ (బీఎల్‌సీ) మోడ్‌లో ఇచ్చే రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని నిలిపివేసినట్లు వెల్లడించింది. ఇంతకుముందు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం రద్దు చేశారు. ఇంటి స్థలం ఉన్న పేదలకు.. గృహ నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం చేసేందుకు గత ప్రభుత్వం గృహలక్ష్మి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం 4 లక్షల ఇళ్లకుగానూ తొలి విడతలో 2.12 లక్షల మందికి ఇళ్లను మంజూరు చేశారు. వీటన్నింటినీ రద్దు చేస్తూ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు.

We’re now on WhatsApp. Click to Join.

గృహలక్ష్మి స్కీమ్‌ను నిలిపివేసేలా, లబ్దిదారులకు జిల్లాల కలెక్టర్లు జారీ చేసిన శాంక్షన్ ఆర్డర్లను రద్దు చేసేలా నిర్ణయం తీసుకోవాలని స్టేట్ హౌజింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ గత నెల 15నే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, కొత్త ప్రభుత్వం అభయహస్తం కార్యక్రమంలో ఇళ్లు లేని పేదలకు సొంతంగా ఇల్లు కట్టుకునేందుకు ‘ఇందిరమ్మ ఇండ్ల’ పథకంలో భాగంగా రూ.5 లక్షల ఆర్థికసాయం చేస్తోంది. దీంతో లబ్ధిదారులకు అదే తరహా ప్రయోజనాలను అందించే ‘గృహలక్ష్మి’ పథకం అమలును నిలిపివేసినట్టు సర్కారు పేర్కొంది. ‘గృహలక్ష్మి’  పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది.

  Last Updated: 03 Jan 2024, 09:04 AM IST