Site icon HashtagU Telugu

GOVT Star Hotel : రూ.582 కోట్లతో హైదరాబాద్‌‌లో ప్రభుత్వ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌.. ఎందుకో తెలుసా ?

Data Engineer

Data Engineer

GOVT Star Hotel : మూడు ఎకరాల విస్తీర్ణంలో భారీ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతోంది. హైదరాబాద్‌ నగరంలోని హైటెక్‌ సిటీకి దగ్గర్లో రాయదుర్గం మెట్రో స్టేషన్‌ తర్వాత ఉన్న ఐకియా షోరూం పక్కన ఇది ఏర్పాటుకానుంది. ఈ హోటల్ నిర్మించనున్న ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలో ఉన్న సర్వే నంబర్‌ 83/1లో ఉంది. ఈ హోటల్‌లో ఏ-గ్రేడ్‌ ట్రేడ్‌ సెంటర్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రచించామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Also Read :Makar Sankranti : ఈ 5 దక్షిణ భారతీయ వంటకాలతో పొంగల్‌ను జరుపుకోండి..! పండుగ మజా రెట్టింపు అవుతుంది..!

ఈ ఐదు నక్షత్రాల హోటల్ 15 అంతస్తుల్లో ఉంటుందట.  8.86 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో దీని నిర్మాణం జరుగుతుంది. దీని నిర్మాణానికి దాదాపు రూ.582 కోట్లు ఖర్చు చేయనున్నారు. దీని నిర్మాణానికి ఆసక్తి ఉన్న నిర్మాణ రంగ కంపెనీల నుంచి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) టెండర్లను ఆహ్వానించింది. టెండర్లను దక్కించుకునే కంపెనీ 36 నెలల్లోగా ఫైవ్ స్టార్ హోటల్‌‌తో పాటు వాణిజ్య కేంద్రాన్ని నిర్మించి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టింది.

ఐటీ, ఐటీఈఎస్‌, బీఎఫ్‌ ఎస్‌ఐ, లైఫ్‌ సైన్సెస్‌, ఏరోస్పేస్‌, ఎలక్ట్రానిక్స్(GOVT Star Hotel)వంటి రంగాల్లో దాదాపు 500 ప్రఖ్యాత కంపెనీలకు హైదరాబాద్‌ హబ్‌గా వెలుగొందుతోంది. దిగ్గజ కంపెనీలకు భాగ్యనగరంలో ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో అంతర్జాతీయ సదస్సులు క్రమంగా పెరుగుతున్నాయి. వాటికి ఆతిథ్యమిచ్చే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికే సొంత ఫైవ్ స్టార్ హోటల్ ఉంటే బాగుంటుందని సీఎం రేవంత్ భావించారు. అందుకే దాని నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగంలో హైదరాబాద్‌ 159వ స్థానంలో ఉంది. దేశంలోని ఉత్తమ నగరాల్లో ఢిల్లీ తరువాత హైదరాబాద్‌ 2వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ టూరిస్టులు, ప్రముఖ కంపెనీల ప్రతినిధుల సౌకర్యార్ధం తెలంగాణ ప్రభుత్వం ఈ లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌‌లోని వాణిజ్య కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్మించతలపెట్టిన టైమ్‌స్క్వేర్‌, టీ-వర్స్క్‌ భవనాలకు అండర్‌గ్రౌండ్‌,  అండర్ పాస్‌లతో అనుసంధానించనుంది.