తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం మాట్లాడుకుంటుంది. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సమ్మిట్ ను అట్టహాసంగా జరిపేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని మీర్‌ఖాన్‌పేటలో దాదాపు వంద ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాంగణంలో ఈ సమ్మిట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల (Three Trillion Dollar) ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉద్దేశించిన ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించబోతున్నారు. కేవలం రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ సమ్మిట్‌కు, 40కి పైగా దేశాల నుంచి దాదాపు 1500 మంది విదేశీ ప్రతినిధులు (ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ రంగాల దిగ్గజాలు సహా) మరియు పలువురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
EMI : ఇండియాలో ఎన్ని కోట్ల మంది EMIలు కడుతున్నారో తెలుసా?
డిసెంబర్ 8 సోమవారం మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయర్ హాజరై ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. వేదికపై బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ కె. బెరి, మరియు ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్ వంటి ప్రముఖులు పాల్గొంటారు. అంతేకాకుండా, మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మరియు వరల్డ్‌బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా వంటి ప్రపంచ దిగ్గజాలు వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో కాలుష్యరహిత ఇంధనం, గ్రీన్ మొబిలిటీ, ఏరోస్పేస్, గిగ్ ఎకానమీ మరియు మూసీ నది పునరుద్ధరణ వంటి కీలక అంశాలపై మొత్తం 26 ప్యానల్ డిస్కషన్స్ జరగనున్నాయి.
భారీ సంఖ్యలో వివిఐపిలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా విషయంలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు, దీని కోసం వెయ్యికిపైగా సీసీ కెమెరాలు మరియు 2,500 మంది పోలీసులు (ట్రాఫిక్ నియంత్రణతో సహా) విధుల్లో ఉంటారు. సాంకేతిక పరంగా ఫ్యూచర్ సిటీలో 100% అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఒకేసారి 10 వేల మంది వైఫై వినియోగించుకునేలా సదుపాయం ఉంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, 3,000 టన్నుల సామర్థ్యం గల ఏసీ యంత్రాలతో పాటు, సదస్సు కార్యక్రమాలను ఎక్కడి నుంచైనా వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు సిద్ధం చేశారు. ఆదివారం నాటికి పనులన్నీ పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
