Telangana Formation Day 2023 : అపురూప క్షణం..అమరుల త్యాగఫలం..నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఈరోజు యావత్ తెలంగాణ (Telangana).. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 01:37 PM IST

Telangana Formation Day 2023 : తెలంగాణ రాష్ట్రం సాకారమైన చారిత్రక దినం..
అమరుల స్వప్నాలు నిజమైన రోజు..
దశాబ్దాల అలుపెరుగని పోరాటం ఫలించిన శుభ తరుణం..
జై తెలంగాణ నినాదం విజయ ఢంకా మోగించిన గోల్డెన్ టైమ్.. 2014 జూన్ 2

జూన్‌ 2 తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఈరోజు యావత్ తెలంగాణ (Telangana).. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైంది. పదో వసంతంలోకి రాష్ట్రం అడుగిడుతున్న గొప్ప సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు సమాయత్తం అయింది. ఈసందర్భంగా తెలంగాణ  సచివాలయంలో సీఎం కేసీఆర్  జెండా ఆవిష్కరించి, దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి నగరం వరకు 21 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తామని, దేశానికి దిక్సూచిగా నిలిచిన తెలంగాణ (Telangana) ప్రగతి దశదిశలా చాటుదామని పిలుపునిచ్చారు. సీఎంగా ప్రమాణం చేసిన రోజు ఇచ్చిన మాటను మరువలేదని కేసీఆర్ గుర్తు చేశారు. మ్యానిఫెస్టోను చిత్తశుద్ధితో అమలు చేశామని, అభివృద్ధి ఫలాలు ప్రజలందించడంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించామన్నారు. జూన్‌ 24 నుంచి పోడు భూముల పట్టాల పంపిణీ చేస్తామని, అలాగే పోడు భూములకు రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ తమిళిసై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న కొంతమందిని సత్కరించడం నా అదృష్టమని, ఉద్యమంలో మమేకమైన ప్రతిఒక్కరికీ వందనాలు తెలియజేశారు.

ఉద్యమానికి ఊపిరి అదే..  

భాషా ప్రాతిపదికన 1956లో ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు భాగంగా ఉన్న తెలంగాణ 58 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయింది. విదర్భ, ఉత్తరాఖండ్, హరిత్‌ప్రదేశ్‌ లాగానే సుదీర్ఘ కాలంగా ప్రత్యేక రాష్ట్రసాధన కోసం తెలంగాణ ప్రాంతంలో ఉద్యమం సాగింది. దాదాపు అర్ధ శతాబ్దంపాటు ఒక రాష్ట్రంగా కలిసి ఉన్నప్పటికీ, తెలుగు మాట్లాడే ప్రజల మధ్య సామాజికంగా, సాంస్కృతికంగా, భావోద్వేగాల పరంగా ఐక్యత ఏర్పడలేదు. ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్థ్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ఈ ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి.  ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మూడు దశలు కనిపిస్తాయి. 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడే సమయంలోనే వ్యతిరేకత  వినిపించడం మొదటి దశ. 1960 లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రెండోది. 1990 తర్వాత కనిపించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మూడో దశగా చెప్పుకోవచ్చు. ముల్కీ నిబంధనల ఉల్లంఘనతో 1960లో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది.

Also read : AI Drone Killed Operator : సైనికుడిపైకి తిరగబడ్డ ఏఐ డ్రోన్.. ఎక్కడంటే ?

1990వ దశకంలోనే రాష్ట్ర సాధనకు పునాది 

1990వ దశకంలో తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరింది. సామాజిక, సాంస్కృతిక సంఘాలు, సంస్థలు, పౌర సమాజ కార్యకర్తలు ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు నడిపించారు. వారంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీలను (జేఏసీలు), పార్టీయేతర సంఘాలను ఏర్పరచి ఉద్యమాన్ని కొనసాగించారు. సైద్ధాంతిక విభేదాలు, పార్టీ విధేయతలను పక్కకు తోసి, కులం, వృత్తి, వర్గం గుర్తింపులను కాలరాసి తెలంగాణ ప్రజలంతా ఒక్క నినాదంతో ఉద్యమించారు. అందుకే 1990వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమం చివరకు విజయమే సాధించగలిగింది. సరిగ్గా ఇదే రోజున అంటే 2014 జూన్‌ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.