Five MPTCs : ప్రస్తుతం తెలంగాణలోని 22 మండలాల్లో ఐదుగురి కంటే తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరి సంఖ్య తక్కువగా ఉండటంతో మండలాల్లో రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి. తక్కువ మంది ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీగా ఎన్నికవుతున్నారు. మిగితా సభ్యులను కలుపుకొని మండల సర్వసభ్య సమావేశాలను నిర్వహించడం పెద్ద సవాలుగా మారుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తప్పకుండా కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 22 మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచేందుకు సీఎం రేవంత్ సర్కారు రెడీ అయింది. ఈ అసెంబ్లీ సెషన్‌లోనే దీనికి సంబంధించిన చట్ట సవరణ చేసేందుకు సమాయత్తం అయింది.
Also Read :Satyadev Zebra : సత్యదేవ్ జీబ్రా ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే..?
తెలంగాణలో మొత్తం 540 మండలాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి వచ్చాక నాలుగు మండలాలను కొత్తగా ఏర్పాటు చేసింది. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించనుంది. ప్రస్తుతం ప్రతి మండలం పరిధిలో సగటున 3వేల జనాభా ఉన్న ఏరియాకు ఒక్కో ఎంపీటీసీ(Five MPTCs) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీలో చేయనున్న చట్ట సవరణ ద్వారా 3 వేల కంటే తక్కువ జనాభా ఉన్న మండలాల్లోని ఏరియాలను కూడా ఎంపీటీసీ నియోజకవర్గంగా గుర్తించనున్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాన్ని రెండు ఎంపీటీసీ స్థానాలకు పెంచే ప్రతిపాదన కూడా ఈ చట్టసవరణలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read :Eyelash Dandruff : కనురెప్పలపై చుండ్రు? మీరు దీని గురించి విన్నారా?
గతంలో మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్న మండలంలో ఎంపీపీ పదవి కోసం ఇద్దరు ఎంపీటీసీలు ఏకమైతే ఒకరు ఎంపీపీ, మరొకరు వైస్ ఎంపీపీ అయ్యేవారు. మిగిలిన ఒక ఎంపీటీసీ అంశాల వారీగా ఆ ఇద్దరికి మద్దతును ప్రకటించేవారు. ఈక్రమంలో కొన్నిసార్లు సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరు అయ్యేవారు. నలుగురు ఎంపీటీసీలు ఉన్న మండలాల్లో సైతం ఇలాంటి పరిస్థితే తలెత్తేది. ఈ ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ సర్కారు సంకల్పించింది. చట్ట సవరణ చేసి ప్రతి మండలంలో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచడం ద్వారా రాజకీయ వివాదాలకు ఇక తావు ఉండదని రేవంత్ సర్కారు భావిస్తోంది.