Telangana: బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 29న రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు తమ్మినేని వీరభద్రం.
ఈ రోజు శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ అనుసరిస్తున్న విధానాలనే కాంగ్రెస్ అనుసరిస్తోందని మండిపడ్డారు. అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాకముందే పలువురు సీపీఎం కార్యకర్తలను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారని అన్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి రూ.31 వేల కోట్లలో రూ.18 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
రుణమాఫీకి రేషన్‌కార్డులను ప్రాతిపదికగా తీసుకోబోమని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రెండు గ్రామాల్లో రుణమాఫీపై అధ్యయనం చేయగా 1,100 మంది రైతులు రుణాలు తీసుకుంటే కేవలం 300 మందికి మాత్రమే రుణమాఫీ చేసినట్లు గుర్తించామని చెప్పారు. ఫుల్ ట్యాంక్ లెవల్, ఇరిగేషన్ ట్యాంకుల బఫర్ జోన్‌లలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైన చర్య అని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: Shikhar Dhawan Retirement: ధావన్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం ఎవరు?