Site icon HashtagU Telugu

OFF TRACK : ‘ఎమ్మెల్సీ’ కోసం కాంగ్రెస్ నేతల లాబీయింగ్.. కవితకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. టీడీపీలో షాకింగ్ రాజీనామా

Off Track Telangana Congress Leaders Mlc Post Kcr Kavitha Ap Tdp Gv Reddy

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: జోరుగా లాబీయింగ్, పదవి కోసం పోటీ

OFF TRACK :  తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు రాజకీయ ఉత్కంఠను పెంచుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నచ్చిన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. సీనియర్ నేతలు, నిబద్ధత కలిగిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని  కాంగ్రెస్ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు ఎంపికయ్యే నలుగురు హస్తం పార్టీ నేతల పేర్లపై పోలింగ్ తేదీ (మార్చి 20) నాటికి మనకు క్లారిటీ రానుంది.

ఎమ్మెల్యే కోటాకు చెందిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఇప్పటివరకు మహ్మద్ మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం ఎగ్గె, మీర్జా రియాజుల్ హసన్ అఫంది ఉన్నారు. వీరి పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ప్రకటన మార్చి 3న వెలువడే అవకాశం ఉంది. నామినేషన్ల స్వీకరణ మార్చి 10 వరకు జరుగుతుంది. నామినేషన్ల పరిశీలన మార్చి 11న జరగనుండగా, మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశమిస్తారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్  నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(OFF TRACK) మొదలవుతుంది.

Also Read :1984 Anti Sikh Riots: కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్‌కు జీవితఖైదు.. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సంచలన తీర్పు

కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఎమ్మెల్సీ స్థానాల కోసం పోటీపడుతున్న నేతల్లో అంజన్ కుమార్ యాదవ్, టీ జయప్రకాశ్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, ఎస్ఏ సంపత్ కుమార్, సీహెచ్. వంశీ చంద్ రెడ్డి, అదంకి దయాకర్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు. బెల్లయ్య నాయక్ (ఎస్టీ కోటా), సునీతా రావు లేదా ఇందిరా శోభన్ (మహిళా కోటా) నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్, ఫహీమ్, షబ్బీర్ అలీ పేర్లు వినిపిస్తున్నాయి. ఓసీ కోటాలో రోహిన్ రెడ్డి, సామా రామ్మోహన్ రెడ్డిలకు అవకాశం ఉందని అంటున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీపీఆర్ఓ అయోధ్య రెడ్డి, సీఎం సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఫహీమ్ ఖురేషీ, రోహిన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే, వీరిని పార్టీలోని కొందరు నాయకులు వ్యతిరేకిస్తుండటంతో, అభ్యర్థుల ఎంపిక విషయంలో ప్రతిష్టంభన నెలకొంది.  ఈ అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ తుది నిర్ణయం తీసుకునే వరకు  లాబీయింగ్ జోరుగా సాగనుంది. నాలుగు ఎమ్మెల్సీ పోస్టుల కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ నేతల్లో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్టీని నమ్ముకున్న వారికే అవకాశం కల్పిస్తారా? లేదా ? అనేది వేచిచూడాలి.

Also Read :Supreme Court: జోగి రమేష్, దేవినేని అవినాష్‌ దేశం విడిచి వెళ్లొద్దు: సుప్రీంకోర్టు

మళ్లీ ఫోకస్‌లోకి కవిత  : కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా?

అధికార కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు కల్వకుంట్ల కవితకు కేసీఆర్ అనుమతి ఇచ్చారా? ఆ దిశగా కవితకు అనుమతి లభించి ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్ పొందినప్పటి నుంచి కవిత తన రాజకీయ కార్యకలాపాలను మరింత జోరుగా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా వెనుకబడిన తరగతుల (బీసీ) సమస్యలపై ఆమె దృష్టిని కేంద్రీకరించారు.

కవిత తిరిగి చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనడంపై బీఆర్ఎస్‌లో తొలుత అందరూ సానుకూలంగా స్పందించలేదు. ఆమె కుటుంబ సభ్యులు సహా కొంతమంది సీనియర్ నేతలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కారణంగా పార్టీకి నష్టమే కలుగుతుందని భావించారు. అయితే ఫిబ్రవరి 19న తెలంగాణ భవన్‌లో జరిగిన కీలక సమావేశం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ సమావేశంలో కేసీఆర్ కవితను తీవ్రంగా సమర్థించడమే కాకుండా, తన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కవిత బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలకు వస్తున్న భారీ జన సమర్థన కూడా ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. ఆమె ఇటీవలే మహబూబాబాద్‌లో నిర్వహించిన సభ విజయవంతమైంది. బీఆర్ఎస్  పార్టీ క్యాడర్ నుంచి భారీ మద్దతు లభించింది. ప్రజలు పెద్ద ఎత్తున ఆ సభలో పాల్గొనడం గమనార్హం. ఈ మద్దతు కేసీఆర్ అండతోనే సాధ్యమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత కేవలం బీసీ సమస్యలపైనే కాకుండా, మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు.

కవిత కేవలం రాజకీయ ప్రసంగాలు ఇవ్వడంతో సరిపెట్టడం లేదు. బీసీ వర్గాలతో ఆమె మమేకం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బలమైన వాణిని వినిపిస్తున్నారు. మహిళల సాధికారత గురించి గొంతు విప్పుతున్నారు. మొత్తం మీద రాజకీయాల్లో తన సత్తాను చాటుకునేందుకు కవిత సర్వశక్తులతో తిరిగి  సిద్ధమయ్యారు.కేసీఆర్ అండదండలతో ఆమె బీఆర్ఎస్‌లో కీలక పాత్రను పోషించబోతున్నారు. దీంతో తెలంగాణలో రాజకీయ యుద్ధం మరింత తీవ్రరూపు దాల్చనుంది.

టీడీపీలో షాకింగ్ పరిణామం.. యువ నాయకుడి రాజీనామాపై చర్చోపచర్చలు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన 14 నెలలకే మొదటి సంక్షోభ సూచనలు కనిపిస్తున్నాయి. వివాదాస్పద ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌ ఛైర్మన్ పదవికి యువ నాయకుడు జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవిని వదులుకోవడమే కాకుండా, టీడీపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. “వ్యక్తిగత కారణాల వల్లే ఇలా చేశా” అని జీవీ రెడ్డి అధికారికంగా చెప్పినప్పటికీ, అసలు కథ వేరే ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

జీవీ రెడ్డి రాజీనామాకు ముందు, ఫైబర్‌నెట్ ఎండీ దినేష్ కుమార్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు టీడీపీ అగ్ర నాయకత్వాన్ని అసహనానికి గురిచేశాయి.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఫైబర్‌నెట్ ఎండీ దినేష్ కుమార్‌‌కు మద్దతు పలికే ఐఏఎస్ అధికారులంతా కలిసి వెళ్లి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. జీవీ రెడ్డి వ్యాఖ్యల అంశాన్ని చంద్రబాబుకు  వారు వివరించారు. ఆ తర్వాత చంద్రబాబును కలిసేందుకు జీవీ రెడ్డి వెళ్లారు. తన వ్యాఖ్యల గురించి సీఎంకు వివరణ ఇచ్చుకునేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో చంద్రబాబు కఠినంగా బదులిచ్చారు. గీత దాటి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ జీవీ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఎఫెక్టు వల్లే జీవీ రెడ్డి పదవులకు రాజీనామా చేసి, తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్  చేశారని అంటున్నారు.  ముఖ్యమంత్రి తనను అలా గట్టిగా హెచ్చరిస్తారని జీవీ రెడ్డి అస్సలు ఊహించలేదని,  ఆయన ఆప్త మిత్రులు చెబుతున్నారు.  టీడీపీ కోసం బాగా కష్టపడినా, నిజాయతీగా పనిచేసినా మోసం చేశారనే అభిప్రాయానికి జీవీ రెడ్డి వచ్చారని అంటున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వివాదంలో తప్పిదం రెండు వైపులా ఉంది. ఫైబర్‌నెట్ ఎండీ దినేష్ కుమార్‌‌‌పై ఏదైనా అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని సంబంధిత మంత్రి జనార్ధన్ రెడ్డి లేదా ఐటీ మంత్రి నారా లోకేశ్‌లకు జీవీ రెడ్డి చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు.  ఏకంగా మీడియా ముందుకు వెళ్లి విమర్శలు, ఆరోపణలు చేయడం జీవీ రెడ్డికి మైనస్ పాయింట్‌గా మారిందని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు కూడా జీవీ రెడ్డి చెప్పేది ఓపికగా విని, ఆచితూచి స్పందించి ఉంటే బాగుండేదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తం మీద ఈ సంఘటన టీడీపీలో  కొంత అలజడికి కారణమయ్యిందని అంటున్నారు. ఈ పరిణామం పార్టీ అంతర్గత రాజకీయాలపై ఎంతమేరకు ప్రభావం చూపిస్తుందనేది వేచి చూడాలి.